
కంభంపాటి హరిబాబు రాజీనామా చేసేశాడు. రెండు సంవత్సరాల నుంచి.. ఎప్పుడు? అన్నట్టుగా వార్తల్లో నిలిచిన లాంఛనం పూర్తి అయ్యింది. హరిబాబును ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారని చాన్నాళ్ల నుంచినే వార్తలు వస్తున్నాయి. అయితే తప్పించడం మాత్రం జరగలేదు. దానికి అనేక కారణాలున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన హరిబాబును ఆ పదవి నుంచి తప్పించడం చంద్రబాబుకు ఇష్టం లేదని, అందుకే మార్పు జరగలేదు అనేది బహిరంగ రహస్యం. అలాగే హరిబాబు ఆ పదవిలో ఉండటం వెంకయ్యనాయుడుకు కూడా ఇష్టమే అనే ప్రచారం సాగిందప్పట్లో.
ఇప్పుడు వెంకయ్య బీజేపీకి దూరం అయ్యాడు. ఉప రాష్ట్రపతి హోదాలోకి వెళ్లిపోయి, ఆయన ప్రభావితం చేసే శక్తిని కోల్పోయినట్టే. ఇక ఇప్పుడు బీజేపీ, టీడీపీల బంధం కూడా తెగిపోయింది. దీంతో చంద్రబాబు కూడా ప్రభావితం చేయలేడు. ఈ నేపథ్యంలో హరిబాబు ఆ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. బీజేపీ అధిష్టానం అడిగి మరీ హరిబాబు చేత రాజీనామా చేయించిందనే మాట వినిపిస్తోంది. ఆ సంగతేమో కానీ.. ఇప్పుడు బీజేపీ ఏపీ విభాగానికి కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఆసక్తిదాయకంగా మారింది.
మాజీ మంత్రి మాణిక్యాల రావును అధ్యక్షుడిగా నియమిస్తారని కొంత ప్రచారం జరిగింది. అయితే ఆయన ఆ పదవి పట్ల ఆసక్తిని చూపడం లేదు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుకు లైన్ క్లియర్ అయినట్టే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇన్నేళ్ల కమ్మవారి చేతిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇప్పుడు కాపుల చేతికి వెళ్లనుందని, అందుకే సోముకు అవకాశం లభిస్తుందని టాక్. ఇక ఏం జరుగుతుందో.. అనూహ్య నిర్ణయాలుంటాయేమో చూడాలి!