అర్థ‌రాత్రి సుప్రీంకోర్టు విచార‌ణ‌ ..సీఎం పీఠంపై యెడ్డీ

Updated By VankayaThu, 05/17/2018 - 10:16
BS Yeddyurappa

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కంటే ఉత్కంఠ‌తో సాగుతున్న క‌న్న‌డ రాజ‌కీయాలు మ‌రోమ‌లుపు తిరిగాయి. అనూహ్య రీతిలో... గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తితో.. కోర్టు ఆదేశాల‌ మ‌ద్ద‌తుతో... కర్ణాటక రాష్ర్ట 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజూభాయ్ వాలా.. యడ్యూరప్పతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్ర‌మాణం కంటే ముందు అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజీఏపీకి తగినంత సంఖ్యా బలం లేదని కావునా ప్రమాణ స్వీకారాన్ని నిలుపుదల చేయాల్సిందిగా పేర్కొంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ బుధవారం రాత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్‌ను సుప్రీం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అర్థరాత్రి అత్యవసర విచారణకు స్వీకరించారు. పిటిషన్‌పై విచారణకు జస్టిస్ భూషణ్, జస్టిస్ సిక్రి, జస్టిస్ బాబ్డేలతో కూడిన ధర్మాసానాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా.. కేంద్ర ప్రభుత్వం తరపున ఏజీ వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, బీజేపీ తరపున ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సుమారు మూడున్నర గంటల పాటు వాద ప్రతివాదనలు కొనసాగాయి. ఈ వాద‌న‌ల సంద‌ర్భంగా  యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఈ పిటిష‌న్ సంద‌ర్భంగా కాంగ్రెస్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల సంఖ్య బలమే ఉందన్నారు. కాగా కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి 117 మంది ఎమ్మెల్యేల బలముందని తెలిపారు. బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం బేరాసారాలకు కచ్చితంగా అవకాశం ఇవ్వడమేనన్నారు. రాష్ట్రపతి పాలనను నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీం ఆదేశాలు ఇవ్వగలిగినప్పుడు గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీం ఎందుకు నిలుపుదల చేయకూడదన్నారు. ప్రమాణ స్వీకారాన్ని జాప్యం చేయడం, వాయిదా వేయడం గవర్నర్ అధికారాలను అడ్డుకోవడం కిందికి రాదని...యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం వాయిదా వేయొచ్చని వెల్లడించారు. గవర్నర్ల నిర్ణయాలను, చర్యలను సమీక్షించవచ్చని పేర్కొన్నారు. 

ముఖుల్ రోహిత్గి, ఏజీ వేణుగోపాల్ తమ వాదనలు వినిపిస్తూ.. అర్థరాత్రి అత్యవసర విచారణ అవసరం లేదన్నారు. రెండు వైపుల వారు మెజారిటీ ఉందంటూ లేఖలు ఇవ్వలేదని తెలిపారు. బల నిరూపణకు ఎన్నిరోజులు ఇవ్వాలన్నది గవర్నర్‌కున్న విశేష అధికారాల పరిధిలోని అంశమని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీనైనా ఆహ్వానించే అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. గవర్నర్ విశేష అధికారాలను అడ్డుకోలేం.. ఆదేశాలు జారీ చేయలేమన్నారు. సభలో బల నిరూపణ పూర్తయ్యాక కాంగ్రెస్ పిటిషన్‌పై విచారణ చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రపతి, గవర్నర్‌లకు ప్రత్యేకమైన విశేషాధికారాలున్నాయి. గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 361 పరిరక్షిస్తుంది. గవర్నర్ విశేషాధికారాలను ప్రశ్నించలేం. కావున కాంగ్రెస్ పిటిషన్‌ను తిరస్కరించాలని ధర్మాసనాన్ని కోరారు.

వాద‌న‌లు విన్న అనంత‌రం జస్టిస్ బాబ్డే, జస్టిస్ సిక్రి స్పందిస్తూ.. ``ఈ వివాదం పరిష్కరానికి ఉన్న మార్గాలేమిటి? ఆర్టికల్ 361 కింద గవర్నర్‌ను నియంత్రించే అవకాశం ఉందా? సాధారణంగా గవర్నర్‌ను సుప్రీంకోర్టు నియంత్రించలేదు. యడ్యూరప్పకు బల నిరూపణకై గవర్నర్ 15 రోజుల సమయం ఎందుకిచ్చారు. బీజేపీ వాదనలు కూడా పూర్తిగా వినాలి. బీజేపీకి సంఖ్యాబలం ఉందా, లేదా అనే అంశాన్ని కూడా చూడాలి`` అని అన్నారు. 15, 16 తేదీల్లో గవర్నర్‌కు ఇచ్చిన లేఖలను కోర్టులో సమర్పించాలని యడ్యూరప్పకు ఆదేశాలు జారీ చేశారు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరిస్తూ తదుపరి విచారణను గురువారం ఉదయం 10.30 గంటలకు వాయిదా వేసింది.

ఇదిలాఉండ‌గా... మొదట ప్రకటించిన విధంగానే కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 2007లో ఒకసారి, 2008లో రెండు సార్లు యడ్యూరప్ప సీఎంగా చేశారు. ఆయన ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడ్యూరప్ప ఒక్కరే నేడు ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప సర్కార్ 15 రోజుల్లో బలపరీక్షను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. బలనిరూపణ తరువాత కేబినేట్ ఏర్పాటు కానుంది.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE