బల్లులు, ఊసరవెల్లులతో గూఢచర్యం చేయిస్తున్నారు!

Updated By VankayaWed, 02/14/2018 - 13:08
Iran believes the US spied on it with special lizards

ఇరాన్ సంచలన ఆరోపణ చేసింది. తమ దేశంపై గూఢచర్యానికి బల్లులు, ఊసరవెల్లులను కూడా వాడుతున్నారని ప్రత్యర్థి దేశాలపై కామెంట్లు చేసింది. ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్, ప్రస్తుత సీనియర్ సలహాదారు.. హసన్ ఫురుజబది ఈ ఆరోపణలు చేశారు. తమ దేశంలో అణ్వస్త్ర సంబంధ కార్యక్రమాలు తెలుసుకునేందుకు కొన్ని దేశాలు ఈ పని చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ మధ్యే.. కొందరు పర్యావరణ వేత్తలను అరెస్ట్ చేయడానికి సంబంధించిన వ్యవహారంపై స్పందిస్తూ.. ఆయన ఈ విషయాన్ని చెప్పారు.

‘‘పాలస్తీనాకు సహాయ నిధి సేకరణ పేరుతో కొన్నేళ్ల క్రితం మా దేశానికి చాలామంది వచ్చారు. పర్యావరణవేత్తల పేరుతో వారు మా దేశంలో తిరిగారు. వారి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. వారి దగ్గర బల్లులు, ఊసరవెల్లులను గుర్తించాం. వాటి చర్మం.. అణు సంబంధ కార్యక్రమాలను గుర్తించి సిగ్నల్ పంపేలా రూపొంది ఉన్నట్టుగా గుర్తించాం. ఇలా చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ.. విఫలమయ్యారు. మా దేశంలో యూరేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. వాటి రహస్యాలతో పాటు.. వాటితో మేం చేసే కార్యక్రమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. ప్రతిసారీ ఫెయిలయ్యారు’’ అని హసన్ వివరించారు.

జర్మనీకి చెందిన ఓ జంట కూడా ఇలాగే అనుమానాస్పదంగా పట్టుబడితే.. తాము టూరిస్టులమని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని హసన్ చెప్పారు.

ఇక.. ఇరానియన్ కెనడియన్ పర్యావరణవేత్త కావూస్ సయ్యద్ ఇమామీని ఇలాంటి ఆరోపణలతోనే ఇరాన్ పోలీసులు ఈమధ్య అరెస్ట్ చేశారు. ఆయన స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఉండగానే.. సయ్యద్ ఇమామీ చనిపోయారు. ఈ విషయాన్ని వెల్లడించే క్రమంలోనే.. తమ దేశంలో బల్లులు, ఊసరవెల్లులతో గూఢచర్యం జరుగుతోందంటూ.. హసన్ సంచలన ఆరోపణ చేశారు.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE