ఎవరికి చెప్పినా పైరసీ ఆగదు

Updated By VankayaWed, 02/14/2018 - 10:28
Kona venkat Complaint to KTR Over Piracy

కాదేది పైరసీకనర్హం అనేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. సినిమాలే అనుకుంటే ఈ జాడ్యం ఇప్పుడు రియాలిటీ షోలకు, వెబ్ సిరీస్ కు కూడా పాకింది. అమెజాన్ సంస్థ ఎంతో ఖర్చు పెట్టి పేరున్న నటీనటులతో తీసిన బ్రీత్ లాంటి వెబ్ సిరీస్ లను కూడా పైరసీ వదలటం లేదు. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన బ్రీత్ లో ఇప్పటి దాకా పది ఎపిసోడ్లకు పైగానే అమెజాన్ ప్రైమ్ లో చూడడానికి స్ట్రీమింగ్ అందుబాటులో ఉంచారు.

అది కూడా పైరసీ రూపంలో వచ్చేసి సబ్ స్క్రిప్షన్ కోసం ఖర్చు పెట్టాల్సిన వెయ్యి రూపాయలు కూడా మిగిలించేలా వీళ్ళు చేస్తున్న పనులు అన్ని ఇన్ని కావు. ఇటీవలే రచయిత కోన వెంకట్ మంత్రి కేటిఅర్ కు ఒక వెబ్ సైట్ గురించి సాక్ష్యంతో సహా ట్వీట్ చేసినా ఇంకా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

తొలిప్రేమ, గాయత్రి, ఇంటెలిజెంట్ తో సహా ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని బాషల కొత్త సినిమాలు ఆ సైట్ లో ఉండటంతో కోన వాటిని స్క్రీన్ షాట్ తీసి ఆయనకు పంపించారు. ఇదేమి కొత్తగా జరుగుతున్న తంతు కాకపోయినా ప్రభుత్వం తరఫున ఆపే చర్యలు మాత్రం శూన్యం. బిగ్ బాస్, జబర్దస్త్ షోలు డౌన్ లోడ్ చేసుకోవడానికి పెడుతున్నారు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డివిడిల హవా తగ్గిన తర్వాత ఆన్ లైన్ పైరసీ జడలు విరబోసుకుంది.

రోజుకి ఒక జిబి డాటా ఫ్రీ గా వస్తున్న తరుణంలో ఒక సినిమా డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది కనక జియో వచ్చాక ఇలాంటి సైట్లకు ఆదరణ పెరుగుతూ పోతోంది. కోన వెంకట్ చెప్పినా మహేష్ బాబు చెప్పినా సైబర్ చట్టం కఠినంగా మారనంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. గతంలో తర్వాతి రోజు పైరసీ వస్తే ఇప్పుడు అదే రోజు సాయంత్రానికి మారిపోయింది. చూస్తూ కూర్చుంటే బెనిఫిట్ షో లైవ్ స్ట్రీమింగ్ పెట్టినా ఏం చేయలేని పరిస్థితి రావొచ్చు. తస్మాత్ జాగ్రత్త.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE