కృష్ణార్జున యుద్ధం రివ్యూ

Updated By VankayaThu, 04/12/2018 - 14:10
KrishnaArjuna Yuddham Movie Review

అతి తక్కువ కాలంలో ఇమేజ్ ని అమాంతం పెంచుకున్న హీరోల్లో నానిది ప్రత్యేక స్థానం. న్యాచురల్ స్టార్ అంటారు కాని బాక్స్ ఆఫీస్ బాషలో అంతకు మించే ఎదిగిన నాని కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం ఈ రోజు విడుదలైంది. నాని సినిమాలకు ఎప్పుడూ ఉండే తరహాలోనే దీని మీద భారీ హైప్ ఏమి లేదు. ఇతని గత సినిమాల మాదిరే బాగుండొచ్చు అనే ప్రీ ఒపీనియన్ ఆల్రెడీ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఫాన్స్ లో కూడా బలంగా నాటుకుపోయింది కాబట్టి ఓపెనింగ్స్ పరంగా లోటు లేకుండా గడిచిపోతోంది. దానికి తోడు నాని డ్యూయల్ రోల్ అనే కాన్సెప్ట్ ఆసక్తిని ఇంకాస్త పెంచింది. మరి పేరులోనే యుద్ధం పెట్టుకుని బరిలో దూకిన కృష్ణార్జునులు యుద్ధం గెలిచారా లేదా మధ్యలోనే ఆయుధాలు అప్పగించి వెనక్కు వచ్చారా రివ్యూలో చూద్దాం 

కథ 
ఇది సింపుల్ ఫార్ములాలో నడిచే డబల్ ఫోటో కథ. కాకపోతే చిన్న ట్విస్ట్ పెట్టి దీన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. కృష్ణ(నాని)చిత్తూర్ జిల్లాలోని ఆకర్తి అనే పల్లెటూరిలో ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేస్తూ అప్పులు తీర్చడం కోసం పొలాల్లో డప్పులు వాయించే యువకుడు. అర్జున్ జయప్రకాశ్(నాని)యూరోప్ లో పెద్ద రాక్ సింగర్. కృష్ణ ఊరి సర్పంచ్(నాగినీడు) మనవరాలు రియా(రుక్సర్ మీర్)మీద మనసు పారేసుకుంటే అక్కడ అర్జున్ ఫోటోగ్రాఫర్ సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అనూహ్యంగా ప్రియా, సుబ్బలక్ష్మి ఒకేసారి హైదరాబాద్ లో కిడ్నాప్ అవుతారు. ప్రియాను కలుసుకోవడానికి ఇండియా వచ్చిన అర్జున్, ఆకర్తి నుంచి సిటీకి వచ్చిన కృష్ణకు విషయం తెలిసి షాక్ అవుతారు. వాళ్ళను విడిపించుకునే లక్ష్యంతో కృష్ణార్జునులు ఒకటవుతారు. అసలు హీరోయిన్స్ మాయం కావడానికి కారణం ఎవరు, కృష్ణ-అర్జున్ వాళ్ళను ఎలా విడిపించుకుంటారు , అసలు సూత్రధారి ఎవరు అనేది బాలన్స్ కథ. 

నటీనటులు 
నాని నటన గురించి కాని టైమింగ్ గురించి నెగటివ్ కామెంట్ చేయడానికి చాలా తక్కువ అవకాశం ఇస్తాడు. ఎందుకంటే సాధారణ సన్నివేశాలను కూడా తన ఈజ్ తో మెప్పించడం రవితేజ తర్వాత నానికే చెల్లింది. అందుకే రొటీన్ సినిమాలు కూడా కొన్ని సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయిపోయాయి. ఇది నాని స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. పాత్ర ఏదైనా తన శాయశక్తులా బలం పోయడానికి కృషి చేసే నాని ఇందులో కూడా అదే చేసాడు. పాస్ అయ్యాడు కూడా. కాని పాత్రల డిజైన్ లోనే లోపం ఉండటంతో మరే ప్రత్యేకత కనిపించక రొటీన్ గానే చేశాడే అనే ఫీలింగ్ కలిగితే అది ముమ్మాటికి నాని తప్పు కాదు.

రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలే అయినప్పటికీ ఎన్టీఆర్ కాలం నుంచి చూస్తున్న టెంప్లేట్ కనక కొత్తదనం అనిపించే అవకాశం ప్రేక్షకుడికి ఇందులో కనిపించలేదు. అయినా ఈ మాత్రం ఎంగేజ్ కావడానికి కారణం కూడా ఒక్క నానినే. సాంకేతిక అంశాల పరంగా ఉన్న చాలా బలహీనతలను నాని కవర్ చేసుకుంటూ వచ్చాడు. ఎంసిఎలో చేసింది కూడా ఇదే. అందులో బలమైన ఎమోషన్ సినిమాను కాపాడింది. ఇందులో అది పూర్తిగా మిస్ కావడంతో నాని కూడా సెకండ్ హాఫ్ వచ్చే సరికి హెల్ప్ లెస్ అయిపోయాడు.కథల ఎంపికలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన టైం అయితే నానికి వచ్చేసింది. అర్జున్ గా కంటే సరదాగా చలాకీగా ఉండే కృష్ణనే అందరికి నచ్చుతాడు . 

హీరొయిన్లు అనుపమ, రుక్సన్ కథకు లింక్ ఉన్న పాత్రలు చేయటంతో పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కింది. అనుపమ తన లుక్స్ తో బాగానే ఆకట్టుకోగా రుక్సన్ మీర్ ఓకే అనిపించింది. హీరో ఫ్రెండ్స్ గ్రూప్ లో మహేష్, రాజేష్, అవినాష్, త్రిశూల్, భరత్  కామెడీని బాగానే మోసారు. బ్రహ్మాజీ అర్జున్ పాత్రకు స్నేహితుడిగా అలా నడిపించేసాడు అంతే. నాగినీడు పాత్ర మర్యాదరామన్న గెటప్ లో ఉండే రొటీన్ పాత్ర. పోలీస్ కానిస్టేబుల్ గా ప్రభాస్ శీను బాగున్నాడు.  విలన్ గా పరిచయమైన రవి అవానా ముప్పాతిక సినిమా దాకా కనిపించడు. అసలు విలన్ ఉన్నాడా లేదా అనేలా నడిపించడం అతని అవకాశాల్ని పూర్తిగా పోగొట్టేసింది

సాంకేతిక వర్గం
దర్శకుడు మేర్లపాక గాంధీ టాలెంట్ ఉన్నవాడే. కుక్కను కిడ్నాప్ చేయటమనే సిల్లీ కాన్సెప్ట్ తో అతను తీసిన ఎక్స్ ప్రెస్ రాజా అంతగా ప్రేక్షకులను మెప్పించడానికి కారణం అతనిలో ఉన్న సెన్స్ అఫ్ హ్యుమర్ ప్లస్ కథనంపై అతను పెట్టే ప్రత్యేక శ్రద్ధ. కాని కృష్ణార్జున యుద్ధం విషయానికి వచ్చేటప్పటికి నాని ఇమేజ్ కి టెంప్ట్ అయ్యాడో లేక రిస్క్ తీసుకుంటే దెబ్బ తినాల్సి వస్తుందని అనవసరంగా ఆందోళన చెందాడో తెలియదు కాని తన మూడో సినిమాకు ఫార్ములా ప్రలోభాలకు గురయ్యాడు గాంధీ.

కథా రచయిత కూడా తనే కాబట్టి బాధ్యత ఇంకా ఎక్కువ తీసుకోవాలి. నాని సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు అనే భ్రమ నుంచి దర్శకులు త్వరగా బయటికి రావడం చాలా అవసరం. కంటెంట్ లో తేడా వస్తా మహా మహా స్టార్లనే మొహమాటం లేకుండా తిప్పికొడుతున్నారు ప్రేక్షకులు. నాని వాళ్ళందరికీ అతీతుడు కానే కాదు. అందుకే వీక్ గా ఉన్న ప్లాట్ లో మనకు న్యాచురల్ స్టార్ బదులు ఒక సాధారణ నటుడు కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి కామెడీ, పాత్రల పరిచయాలు, ప్రేమ కథలతో టైం పాస్ చేసి ఇంటర్వెల్ కు అసలు ట్విస్ట్ ఇచ్చిన గాంధీ సెకండ్ హాఫ్ లో చాలా సరుకు దాచాడేమో అనే అనుమానం కలిగేలా చేస్తాడు. కాని వాటిని పూర్తిగా నీరుగారుస్తూ పేలవమైన టేకింగ్ తో పాటు ఏ మాత్రం ఉత్సాహం కలిగించని పాటలతో లాగించేయడంతో నాని ఫాన్స్ తప్ప మిగిలిన వాళ్ళు ఇక్కడ పూర్తిగా డిస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

బిగిసడలని టేకింగ్ మేర్లపాక గాంధీ మొదటి రెండు సినిమాలను సక్సెస్ చేసాయి. అదే టెంపో ఇందులో కూడా చూపించి ఉంటే నాని తన టైమింగ్ తో మరో లెవెల్ కు తీసుకెళ్ళేవాడు. కాని గాంధీ రిస్క్ తీసుకోకుండా కమర్షియల్ సూత్రాలలో డ్యూయల్ రోల్ కథను రాసుకోవడం వల్ల ఒక స్టేజి కి వచ్చే సరికి నాని కూడా నిస్సహాయుడిగా మారిపోయాడు. పైగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఆశించిన ప్రేక్షకులకు ఇది లవ్ స్టొరీ నుంచి యాక్షన్ మోడ్ కు టర్నింగ్ తీసుకోవడం సింక్ కాక నిరాశ చెందే అవకాశం ఉంది. 

ధృవ ఫేం హిప్ హాప్ తమిజా చాలా గ్యాప్ తర్వాత తెలుగు స్ట్రెయిట్ మూవీ చేసాడని చాలా అంచనాలు పెట్టుకుంటాం కాని వాటిని నీరుగారుస్తూ పేలవమైన అవుట్ పుట్ ఇచ్చాడు అతను. ఒక్క దారి చూడు దుమ్ము చూడు పాట మాత్రమే అందరికి నచ్చే నెంబర్ కాగా మిగిలినవన్నీ కూడా అసలు ట్యూన్ కట్టకుండా అలా అలా పాడించుకుంటూ పోయారేమో అనే అనుమానం కలిగేలా ఉన్నాయి. విజువల్ గా ఓకే కాని రాంగ్ ప్లేస్ మెంట్ వల్ల బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే ఇచ్చాయి. నాని సినిమాలకు వరసగా చేస్తున్న కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని మరోసారి తన పనితనంతో ఆకట్టుకున్నాడు. ఇతని వరకు మైనస్ అంటూ ఏమి లేదు. చిత్తూర్-యూరోప్ రెండు పూర్తి విభిన్నమైన బ్యాక్ డ్రాప్స్ ని చూపించిన తీరు మెప్పిస్తుంది.సత్య ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. సుమారు గంటన్నరపైగా ఉన్న ఫస్ట్ హాఫ్ లో కత్తెర పడొచ్చు అనుకునే సీన్స్ చాలానే ఉన్నాయి. సాహు-హరీష్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు అవసరమైనంత ఖర్చు పెట్టుకుంటూ పోయారు.

ప్లస్ పాయింట్స్ 
కృష్ణ పాత్రలో నాని 
దారి చూడు పాట 
ఫస్ట్ హాఫ్ కామెడీ 
ఇంటర్వెల్ ట్విస్ట్ 

మైనస్ పాయింట్స్ 
రెండో సగం 
పాటలు 
సెకండ్ హాఫ్ సీరియస్ నెస్
టేకింగ్ 

చివరి మాట 
ఒక్క మాటలో చెప్పాలంటే టైటిల్ లోనే కాదు మేకింగ్ లో సైతం కొంత ఓల్డ్ స్కూల్ లో నిలిచిపోయిన ఒక మామూలు సినిమా కృష్ణార్జున యుద్ధం. నాని దీనికి అడ్డుగోడలా నిలిచే ప్రయత్నం చేసాడు కాని దర్శకుడి తప్పుల వల్ల మొత్తాన్ని క్యారీ చేయలేకపోయాడు. అయినా కూడా క్షమించి ఓసారి చూడొచ్చు అనిపించేలా ఉందంటే దానికీ కారణం నాని ఒక్కడే. కానీ ప్రతిసారి నాని మీద ఇంత భారం వేసి సినిమాలను లాగిస్తే సక్సెస్ అవ్వొచ్చు అనే గుడ్డి నమ్మకం దీంతో బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాని ఉంటే చాలు ఇంకేమి అక్కర్లేదు అనుకునే ఫ్యాన్స్ మాత్రం యుద్ధాన్ని కొంతవరకు ఎంజాయ్ చేయొచ్చు. మామూలు ప్రేక్షుకులకు మాత్రం యుద్ధం చేయడం కష్టమే.

కృష్ణార్జున యుద్ధం – పూర్తిగా గెలవలేదు

రేటింగ్ : 2.25 / 5

 

In English :

Nani's KrishnaArjuna Yuddham Movie Review!!

 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE