మహానటి మూవీ రివ్యూ

Updated By VankayaWed, 05/09/2018 - 14:22
Mahanati Movie Review

నటీనటులు : కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్,సమంత,విజయ్ దేవరకొండ

దర్శకత్వం, స్క్రీన్ ప్లే : నాగ్ అశ్విన్

నిర్మాతలు : ప్రియాంక దత్, స్వప్న దత్

సంగీతం : మిక్కీ జె మేయర్

సినిమాటోగ్రఫర్ : డాని

ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

కాలగర్భంలో ఎందరో మహానుభావులు తమ తనువు చాలించినా వారి ఘనతలు చిరకాలం ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచే ఉంటాయి. అందులోనూ సినిమా హీరో హీరొయిన్లది ప్రత్యేక స్థానం. సినిమా అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ, పిచ్చి కలిగిన భారతీయుల్లో అందుకే నటీనటుల పట్ల ఎక్కడా లేని విపరీతమైన ఆదరాభిమానాలు ఉంటాయి. అందుకే వారసుల వారసులు ఎందరు వచ్చినా ఆదరణ విషయంలో లోటు ఉండదు.

అందుకే మహానాటి సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎన్నడు లేని ఆసక్తి దీని మీద స్పష్టంగా కనిపించింది. కారణం మొన్నటి తరం కళకు పర్యాయపదంగా నిలిచిన కలల రాణి జీవిత కథను మూడు గంటల సినిమా రూపంలో చూపిస్తారన్న నేపధ్యమే. అందుకే సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి దాకా మహానటి మీద గూడు కట్టుకున్న అంచనాలు అంతకంతకు పెరుగుతూ వచ్చాయి తప్ప కొంచెం కూడా తగ్గినట్టు కనిపించలేదు. మరి మహానటి అందుకు తగినట్టు ఉందా లేదా రివ్యూలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం పదండి

కథ 
సుప్రసిద్ధ హీరోయిన్ సావిత్రి బెంగళూరు చాళుక్య హోటల్ లో అపస్మారక స్థితిలో ఉండగా హాస్పిటల్ కు తీసుకెళ్తే కోమా అని తేల్చుతారు. అలా ఒక ఏడాది గడిచిపోతుంది. తన స్టోరీ కవర్ చేయడానికి ప్రజావాణి పత్రికలో పనిచేసే మధురవాణి(సమంతా)ను పంపిస్తాడు ఎడిటర్(తనికెళ్ళ భరణి). ఆంటోనీ(విజయ్ దేవరకొండ)తో కలిసి సావిత్రి గురించి రీసెర్చ్ మొదలుపెడుతుంది మధురవాణి.

అక్కడ నుంచి సావిత్రి కథ మనకు చూపిస్తుంది వాణి. పెదనాన్న వెంకటరామయ్య చౌదరి(రాజేంద్రప్రసాద్)సహాయంతో సావిత్రి చెన్నై వచ్చి అవకాశాలు ఎలా దక్కించుకుంది, పెళ్లై ఇద్దరు పిల్లలున్న రామస్వామి గణేషన్(దుల్కర్ సల్మాన్)తో పరిచయం ఎలా ప్రేమగా మారింది, తన జీవితం విషాదం వైపు ఎలా మలుపు తిరిగింది అనేది వెండితెరపై మాత్రమే చూడాల్సిన సశేషమైన సావిత్రి అమర కథ.

నటీనటులు 
ఇక్కడ ఒక్క విషయం స్పష్టం. మహానటిలో ఉన్న నటీనటులు ఎవరైనా సరే నిజ జీవితంలోని ఆయా పాత తరం వాళ్ళను మరిపించారా లేదా అనే పోలిక అప్రస్తుతం. ఎందుకుంటే ఇంతకు మించి ఇంత కన్నా ఎవరు చూపించే, చేయించుకునే అవకాశం లేదు కనక అదే పనిగా లోటుపాట్లు ఎంచాల్సిన పని లేదు. మహానటిగా కీర్తి సురేష్ ఎందుకు బెస్ట్ ఛాయసో ప్రతి నిమిషం మనం కన్విన్స్ అయ్యేలా చూపాడు దర్శకుడు నాగ అశ్విన్. తనను కాకుండా సావిత్రినే చూస్తారనే స్పృహ ఉంది కనకే కీర్తి సురేష్ కూడా చాలా జాగ్రత్తగా ఈ పాత్ర పోషించడం గమనించవచ్చు.

సావిత్రి గారిని రీ క్రియేట్ చేయటం, ఆవిడ హావభావాలను ఇతరుల మొహంలో పలికించడం అసాధ్యం. ఇందులో ఆర్గుమెంట్ కు ఆస్కారం లేదు, ఇది తెలిసే కీర్తి సురేష్ తన బాడీ లాంగ్వేజ్ మరీ ఓవర్ ది బోర్డ్ దాటకుండా లిమిట్స్ లోనే ఉంటూ సాధ్యమైనంత మేర పూర్తిగా మెప్పించడంలో న్యాయం చేసింది. జెమినీ గణేష్ పాత్రలో ఉన్న దుల్కర్ సల్మాన్ తో లవ్ ట్రాక్ లో రెగ్యులర్ హీరొయిన్ లాగే కాసేపు అనిపించినా తన నట జీవితంలోని కీలక పాత్రలకు సంబంధించిన సన్నివేశాల్లో మాత్రం అచ్చం సావిత్రినే దిగి వచ్చిందా అనిపించేలా మేజిక్ చేయడానికి కీర్తి సురేష్ ఆశించిన దాని కన్నా నటన రూపంలో ఎక్కువ సహకారం నాగ అశ్విన్ కు అందించింది. కాకపోతే ఇక్కడ సావిత్రి గారిలా లేదే, అక్కడ సావిత్రి రేంజ్ లో ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేదే అని కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మొదలుపెడితే మాత్రం ఎంచి చూపడానికి లక్ష తొంభై ఉన్నాయి.

కాని ఈ మాత్రం సాహసానికి హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఆ పని చేస్తే మాత్రం మహానటిని కాదు తెలుగు సినిమాను అవమానించిన్నట్టే. కీర్తి సురేష్ కెరీర్ లో మరో బయోపిక్ చేయవచ్చు గాక. కాని గుండెల మీద చెయ్యి వేసుకుని ఇదే తన కెరీర్ బెస్ట్ అవుతుంది అని రాసివ్వొచ్చు. సావిత్రి గారి జీవితంలో పోగొట్టుకోవండం మొదలైన సీన్స్ నుంచి చూస్తే మాత్రం కంట తడి పెట్టించే పాత్రలో కీర్తి సురేష్ నటన పీక్స్ అంతే. జాతీయ అవార్డు కోరుకోవడం అత్యాశ కాదు. స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి అది కూడా ఒక కారణం కాబోలు. 

ఇక ఈ కథను మనకు చెప్పే జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంతాకు దక్కిన మరో ఆణిముత్యం ఈ సినిమా. రంగస్థలం రామలక్ష్మిగా ఇంకా ప్రేక్షకుల మనస్సులో నుంచి చెరిగిపోక ముందే దానికి పూర్తి భిన్నమైన నత్తి నత్తిగా మాట్లాడే పాత్రలో మనకు కనిపించే సమంతా పర్ఫెక్ట్ ఛాయస్ గా నిలిచింది. చివర్లో తన మాటల ద్వారానే కంటితడి పెట్టేలా చేస్తుంది. విజయ్ దేవరకొండకు ప్రత్యేకంగా చెప్పుకునేంత స్పాన్ దొరకలేదు. తనకు సినిమా లైఫ్ ఇచ్చాడన్న అభిమానంతో నాగ అశ్విన్ కోసం చేసాడే తప్ప సమంతాకు సహాయపడే పాత్రలో ఇతను కనిపించేది కొన్ని సీన్స్ మాత్రమే. ఇక దుల్కర్ సల్మాన్ గట్స్ ని మెచ్చుకోవాలి.

సావిత్రి జీవితం ఇలా కావడంలో ముందు నుంచి దూషించబడుతున్న జెమిని గణేషన్ పాత్రను ఎంచుకోవడం అంటే ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ దిశగా అడుగులు వేస్తున్న దుల్కర్ లాంటి హీరోకు రిస్కే. కాని చాలా ఈజ్ తో చేసి చూపించాడు. కీర్తి సురేష్ తో అతని కెమిస్ట్రీ అద్భుతంగా సింక్ అయ్యింది. తన యాక్టింగ్ స్కిల్స్ ని కూడా పూర్తిగా వాడుకున్నాడు. ఇక ఈ నాలుగు పాత్రలు కాకుండా మనకు కనిపించేవి అన్ని సందర్భానుసారం వచ్చేవి. 

సావిత్రి జీవితంలో కీలక పాత్ర పోషించిన ఆవిడ పెదనాన్న కెవి చౌదరిగా రాజేంద్ర ప్రసాద్ ఒదిగిపోయాడు. కాకపోతే లెంగ్త్ సమస్య వల్ల సావిత్రి జీవితంలో ఆయన ఎంత సింహ భాగం తీసుకున్నారు అనేది ఫస్ట్ హాఫ్ లో చూపించినంత రెండో భాగంలో చూపించే అవకాశం దక్కలేదు. ఎస్విఆర్ గా మోహన్ బాబు, కెవి రెడ్డిగా క్రిష్, చక్రపాణిగా ప్రకాష్ రాజ్, సుశీలగా శాలిని పాండే, ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్, స్టిల్ ఫోటోగ్రాఫర్ గా సీనియర్ నరేష్, ఎడిటర్ గా తనికెళ్ళ భరణి, పెద్దమ్మ గా భానుప్రియ, అమ్మగా దివ్యవాణి, ప్రాణ స్నేహితురాలిగా షాలిని పాండే, జెమినీ గణేషన్ మొదటి భార్యగా మాళవిక నాయర్ అందరూ కథలో ఉన్న స్పాన్ మేరకు అలా కనిపించి ఇలా వెళ్ళిపోయే వారే. కాని ఎక్కడా ఇంపాక్ట్ తగ్గకుండా సినిమాకు విజువల్ గ్రాండియర్ రావడంలో ఇతోధికంగా సహాయపడ్డారు. ఇంకా లిస్టు పెద్దదే ఉంది కాని ముఖ్యమైన వాళ్లనే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది 

సాంకేతిక వర్గం
సావిత్రి లాంటి మొదటి తరం ఎవర్ గ్రీన్ హీరొయిన్ గురించి మూడు గంటల్లో చెప్పే ప్రయత్నం చేయటం అంటే సముద్రం లోతుని ఒక చిన్న గిన్నెలో ఒడిసిపట్టే సాహసం చేయడమే. దానిని కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న నాగ అశ్విన్ ఎంచుకోవడం అంటే అంతకు మించే అని చెప్పాలి. నేటి తరానికి సావిత్రి ఒక గొప్ప నటిగా తప్ప ఆవిడ నిజ జీవితంలో ఏం జరిగింది అనే అవగాహన కొందరికే ఉంది. ఆ పరిమితినే అశ్విన్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

సావిత్రి జీవితంలో అలా జరిగింది ఇలా జరిగింది అని చూపిస్తూ పోతే ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి అలా అనిపించే అవకాశం ఇవ్వకుండా కమర్షియల్ సినిమా ఫార్మాట్ లోనే స్క్రీన్ ప్లే రాసుకున్న తన తెలివితేటలు అబ్బురపరుస్తాయి. కానీ తన సినిమా కెరీర్ తో పాటు జెమిని గణేషన్ తో వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది అనే విషయాలను కాస్త డిటైల్డ్ గా చూపించే ప్రయత్నం సెకండ్ హాఫ్ లో చేయటంతో అక్కడ స్లో అయిన ఇబ్బంది కలుగుతుంది. సావిత్రి గారి జీవితంలో విషాదం ఎందుకు మొదలైంది అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఆవిడ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ తీయకుండా కూలంకుషంగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ను నాగ అశ్విన్ చూపే ప్రయత్నం చేసినప్పటికీ ప్రేక్షకులు అంతకు మించి మరికొన్ని ఆశిస్తారు అనే పాయింట్ కాస్త మిస్ అయ్యాడు.

సావిత్రి గారు మద్యానికి అలవాటు పడి తన పతనాన్ని తనే రాసుకోవడం మొదలు పెట్టిన తర్వాత తన కెరీర్ ప్రారంభంలో చేయూతనిచ్చిన వాళ్ళెవరూ ఆమెను మార్చే ప్రయత్నం కాని చెప్పే సాహసం కాని ఎందుకు చేయలేకపోయారు లాంటి శేష ప్రశ్నలకు సమాధానాలు మాత్రం పూర్తిగా దొరకలేదు. దర్శకుడిగా నాగ అశ్విన్ ఒక అద్భుతమైన టెక్నీషియన్. అలనాటి వాతావరణాన్ని పునఃసృష్టి చేసి దశాబ్దాల వెనక్కు టెక్నాలజీ లేని బ్లాక్ అండ్ వైట్ కాలానికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయటం నిజంగా అభినందనీయం.

కాకపోతే సావిత్రి గారి సినిమా కెరీర్లోని కీలక ఘట్టాలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని హై లైట్ చేయటం కోసం సెకండ్ హాఫ్ మొత్తం వాడుకోవడం కొంత ఇబ్బంది అనిపించినా ఓవరాల్ గా సావిత్రికి ఇచ్చిన ఘన నివాళిగానే ఈ సినిమాను తీసుకోవాలి తప్ప కమర్షియల్ యాంగిల్ లో చూడటం భావ్యం కాదు. సాయి మాధవ్ బుర్రా మాటలు సినిమాలో ఫీల్ ని కిల్ చేయకుండా చక్కగా అమిరాయి. చాలా సహజంగా అనిపించే సంభాషణలతో ఆకట్టుకున్న సాయి మాధవ్ కు పద్మావతి విశ్వేశ్వర్ సహకారం బాగుంది. 

ఇక మిక్కి జే మేయర్ విషయానికి వస్తే నాగ అశ్విన్ ఈ శిల్పాన్ని చెక్కితే అతను అద్భుతమైన రంగులు అద్దాడు. ఆడియో ద్వారా ఇప్పటికే మెప్పించిన మిక్కి జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో లైఫ్ ఇచ్చాడు. టైటిల్ సాంగ్ తో పాటు బాల్యంలో వచ్చే పాట, క్లైమాక్స్ లో వినిపించే పాట దేనికవే సాటి అనేలా కంపోజ్  చేసిన తీరు చూస్తే ఎందుకు ఇతను సెలెక్టివ్ గా తక్కువ సినిమాలు చేస్తాడనిపించడం సహజం. డాని సాలో కెమెరా గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. నాగ అశ్విన్ ఆలోచనలు తన కెమెరా కంటితో చూపించిన పనితనం గురించి చెప్పాలంటే సూపర్ అనే మాట చాలా చిన్నది.

అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్షన్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా సహజంగా అనిపించే అప్పటి వాతావరణాన్ని పాత తరం చూసినా అవును అప్పట్లో అలాగే ఉండేది అనిపించేలా చేసిన అతని నైపుణ్యం సినిమా స్థాయిని పెంచింది. కోటగిరి వెంకటేశ్వర్ రావు గారి ఎడిటింగ్ అనుభవాన్ని రంగరించుకుని మంచి క్వాలిటీ ఇచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొద్దిగా ట్రిమ్ చేసుంటే బాగుండేది. సావిత్రి గారి జీవితం స్లోగా ఉన్నా ప్రేక్షకుల మెదడు మాత్రం స్క్రీన్ ప్లే తో పాటు స్పీడ్ గా ప్రయాణించేది.

వైజయంతి బ్యానర్ సమర్పణలో స్వప్న సినిమా చేసిన ఈ ప్రయత్నానికి నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎక్కడా రాజీ అనే మాట లేకుండా ఇలాంటి కథకు, కాన్వాస్ కు ఎంత కావాలో అంత పెట్టారు . అ ఖర్చు ప్రతి ఫ్రేంలోనూ కనిపిస్తుంది. ఒక సినిమా మహిళ జీవన ప్రస్థానాన్ని ప్రేక్షకులకు చూపించడం కోసం  కంకణం కట్టుకున్న స్వప్నా దత్, ప్రియా దత్ కార్య దక్షత నిజంగా స్ఫూర్తిదాయకం. 

పాజిటివ్ పాయింట్స్ 
కీర్తి సురేష్ 
నాగ అశ్విన్ విజన్ అండ్ టేకింగ్ 
మిక్కి జె మేయర్ మ్యూజిక్ 
దుల్కర్ సల్మాన్, సమంతా పాత్రలు 
స్టార్ కాస్ట్ 
కెమెరా అండ్ ఆర్ట్ వర్క్
క్లైమాక్స్

నెగటివ్ పాయింట్స్ 
అక్కడక్కడ స్లో కావడం 

చివరి మాట 
చాలా చాలా ఆరుదుగా జరిగే కొన్ని ప్రయత్నాలకు ఉపమానాలు కాని కొలమానం కాని ఇవ్వడం కరెక్ట్ కాదు. మహానటి ఆ కోవలోకే వస్తుంది. కొత్త తరానికి పరిచయం లేని ఒక నట వైదుష్యాన్ని, ఆమె జీవితాన్ని తెరమీద చూపించే ప్రయత్నం చేసినందుకు మనసారా నాగ అశ్విన్ ను, ఇంత నమ్మి ఖర్చు పెట్టిన వైజయంతి సంస్థను అభినందించి తీరాలి. ఇది అందరికి నచ్చే సినిమా కాకపోవచ్చు.కాని చూసిన ప్రతి ఒక్కరు తీసినవారిని ఖచ్చితంగా మెచ్చే చిత్రం అయితే అవుతుంది.

ఏడాదికి ఒకసారి జయంతికో వర్ధంతికో గతించిన మాజీ సినిమా నటీనటుల పటాలకో పూలమాల వేసి చేతులు దులుపుకోకుండా ఇలాంటి సినిమాల ద్వారానే వాళ్ళకు నిజమైన నివాళి అర్పించే మహానటి లాంటి సినిమాలకు రెడ్ కార్పెట్ వేసి వెల్కం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగితే మరికొందరు సినీ మహనీయుల జీవితాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అదే ఆశిద్దాం. మనసారా కోరుకుందాం 

మహానటి : సావిత్రి గారిని మళ్ళి బ్రతికించారు 

రేటింగ్ : 3.5/5

In English : 

Savitri's Mahanati Movie Review

 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE