మెహబూబా మూవీ రివ్యూ

Updated By VankayaFri, 05/11/2018 - 14:07
Mehbooba Movie Review

నటీనటులు : ఆకాష్ పూరి, నేహా శెట్టి

దర్శకత్వం, స్క్రీన్ ప్లే, నిర్మాత : పూరి జగన్నాథ్

సంగీతం : సందీప్ చౌత

సినిమాటోగ్రఫర్ : విష్ణు శర్మ

ఎడిటర్ : జునైద్‌ సిద్ధిఖీ

టాలీవుడ్ ను వరస విజయాలు పలకరిస్తున్న నేపధ్యంలో పూరి జగన్నాధ్ దర్శకుడిగా వచ్చిన మెహబూబా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించడం ముందు నుంచి ట్రేడ్ సర్కిల్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిగా మారింది. క్రేజ్ పూర్తిగా కోల్పోయిన పూరి తన కొడుకుని పెట్టి పెద్ద సాహసమే చేస్తున్నాడు అనే కామెంట్స్ చాలానే వచ్చాయి.

కాని మెహబూబా యూనిట్ మాత్రం సినిమా మీద చాలా గట్టి నమ్మకాన్నే చూపిస్తూ వచ్చింది. కొత్త హీరో హీరొయిన్లతో పాటు నేపధ్యం కూడా ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో చూడనిది కావడం లాంటి కారణాలు హైప్ వచ్చేలా చేసాయి. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించిన మెహబూబా దానికి తగ్గట్టు సినిమాలో కంటెంట్ ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పని చేసే కృష్ణమూర్తి(షాయాజి షిండే)కొడుకు రోషన్(పూరి ఆకాష్). చిన్నప్పుటి నుంచి పూర్వజన్మలో తనను ఎవరో  చంపినట్టు కలలు కంటూ ఉంటాడు. పెరిగి పెద్దయ్యి మిలిటరీ కోసం దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ఉంటాడు.  పాకిస్థాన్ లో ఉండే హయత్ ఖాన్(మురళి శర్మ)కూతురు ఆఫ్రిన్(నేహా శెట్టి)కు రోషన్ లాగే కలలు వస్తుంటాయి. చదువు కోసం కొంత కాలం పాటు ఇండియా వచ్చిన ఆఫ్రిన్  కొన్ని సంఘటనల తర్వాత రోషన్ ను కలిసినట్టే కలిసి విడిపోతుంది.

ఫ్రెండ్స్ తో కలిసి హిమాలయకు ట్రెక్కింగ్ కోసం వెళ్లిన రోషన్ కు అక్కడ మంచు కొండల్లో పోయిన జన్మలో మరణించిన ఆఫ్రిన్ డెడ్ బాడీ దొరుకుతుంది. ఆమె డైరీ ద్వారా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. నివ్వెరపరిచే విషయాలు అందులో ఉంటాయి. అసలు రోషన్ కు ఆఫ్రిన్ కు గత జన్మలో ఉన్న ప్రేమ ఎలాంటిది, ఎందుకు విడిపోయారు, వర్తమానంలో రోషన్ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే మెహబూబా అసలు కథ.

నటీనటులు

ఇప్పుడిప్పుడే రెండు పదుల వయసు దాటుతున్న కొత్త హీరో ఆకాష్ పూరి యాక్టింగ్ స్కిల్స్ గురించి పూర్తి స్థాయి జడ్జ్ మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాని తనదే కీలక పాత్ర కాబట్టి దృష్టి మొత్తం తన మీదే ఉంటుందని తెలిసే ఆకాష్ పూరి తనలో బెస్ట్ ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. మొదటి సినిమా కాబట్టి డెబ్యు హీరోలకు ఉండే పరిమితులు ఇతనికీ ఉన్నాయి. వాటిని సాధ్యమైనంత మేరకు ఓవర్ టేక్ చేస్తూ మంచి అవుట్ పుట్ వచ్చేలా నాన్న అడిగిన క్వాలిటీ తన ఎక్స్ ప్రెషన్స్ లో ఇచ్చేలా ఎంత చేయాలో అంత చేసాడు.

ఆ రకంగా చూసుకుంటే పూరి ఆకాష్ పాస్ అయినట్టే. ఇక్కడ మరొక విషయం మర్చిపోకూడదు. ఇది సింపుల్ లవ్ స్టొరీ కాదు. అలాంటివి వర్క్ అవుట్ కావని తెలిసే పూరి ఈ సారి క్లిష్టంగా అనిపించే ఇండో పాక్ నేపధ్యాన్ని తీసుకున్నాడు. అందులోనూ హీరో దేశం కోసం పోరాడే సైనికుడు. చాలా బరువునే మోసాడు ఆకాష్ పూరి. ఇంకా టీనేజ్ తాలుకు లేతదనం మొహంలో స్పష్టంగా కనిపిస్తున్న ఆకాష్ పూరిలో ఒక ప్రేమికుడు కనిపించాడు అంటే అది అతని కష్టానికి ఫలితమే.

ముఖ్యంగా పాకిస్తాన్ కు వెళ్ళినప్పుడు తన ప్రేమ ను అక్కడి పెద్దలకు ఎక్స్ ప్రెస్ చేసే సీన్ లో యూత్ తో విజిల్స్ కొట్టించుకుంటాడు. సరైన రీతిలో ఆకాష్ పూరి ని మలుచుకుని నటనను మెరుగుపరుచుకునే పాత్రలు ఇస్తే ఆకాష్ పూరి మరో మంచి హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాని దానికి టైం అయితే పడుతుంది.

ఇక హీరొయిన్ నేహా శెట్టి లుక్స్ పరంగా ఓకే కానీ మరీ గొప్ప అందగత్తె కాదు. ఇలాంటి కథకు పరిచయం లేని ఫ్రెష్ బ్యూటీ అయితేనే ప్రేక్షకులు కథలోని ఆత్మకు కనెక్ట్ అవుతారు కాబట్టి పూరి తీసుకున్నాడు కాని తను చాలా యావరేజ్ బ్యూటీ. నటనకు వేరియేషన్స్ చూపించే అవకాశం ఉన్నా వాడుకోలేదు. హావభావాల్లో ఇంకా బేసిక్ స్టేజిలోనే ఉన్న నేహ శెట్టి దాని మీద దృష్టి పెడితే మంచిది. షియాజీ షిండే పూరి సినిమా అంటే చాలు ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తాడో అర్థం కాదు. హీరో తండ్రిగా పావలాకు రూపాయి చేసి చూపించాడు. మురళి శర్మది కూడా ఇదే తంతు కాని కొంతలో కొంత నయం.

ఇక హీరొయిన్ ని చేసుకునేవాడిగా నాదిర్ పాత్ర వేసిన నటుడి గురించి చెప్పుకోవాలంటే మాటలు చాలవు. హిందిలో మాట్లాడుతూ అతిగా చేయకపోతే తెలుగులో అవకాశాలు ఇవ్వరేమో అన్నంత దారుణంగా చేసాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే లేడీ ఆర్మీ ఆఫీసర్, అక్కడక్కడ హీరో హీరొయిన్ల తల్లులు ఎవరికి వారు ఈ లైఫ్ టైం అవకాశాన్ని పూర్తిగా వాడుకున్నారు.

సాంకేతిక వర్గం

పూరి జగన్నాధ్ తన పాత పొరపాట్ల నుంచి కొంచెం కూడా నేర్చుకోలేదు. ప్రేక్షకులను మరీ అమాయకులుగా లెక్కగట్టి సినిమాలు తీసినంత కాలం ఇకపై సక్సెస్ అందుకోవడం అసాధ్యం. లాజిక్స్ ఉండాలి అన్న రూల్ లేదు కాని ఇండియా పాకిస్తాన్ లాంటి సున్నితమైన అంశాన్ని స్పృశించినప్పుడు బేసిక్స్ ని పరిగణలోకి తీసుకోవడం చాలా అవసరం. కాని పూరి ఇక్కడే పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.

దశాబ్దాల పాటు హీరొయిన్ శవం మంచు కొండల్లో భద్రంగా ఉండటం, ఒక సంవత్సరం ఇంజనీరింగ్ కోసం పాకిస్తాన్ నుంచి ఆమె ఇండియాకు రావడం, ఏదో పక్కనే ఉన్న పల్లెటూరికి వెళ్లినట్టు హీరో పాకిస్తాన్ కు వెళ్ళడం, ఆర్మీ బోర్డర్ అంటే ఆర్టిఓ చెక్ పోస్ట్ లాగా సిల్లీ గా చూపించడం లాంటి బ్లండర్స్  చాలానే చేసిన పూరి సెకండ్ హాఫ్ మొత్తం నవ్వించాడు. కామెడీతో కాదు అర్థం పర్థం లేని టేకింగ్ తో. ఇదేదో అమర ప్రేమ కథలా ప్రొజెక్ట్ చేయాలనీ ప్రయత్నించిన పూరి ఎక్కడా ఎమోషనల్ గా టచ్ చేయలేకపోవడం సినిమాని ఆసాంతం దెబ్బ తీసింది.

ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించుకున్నా ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి పూరి కథనాన్ని నడిపించిన తీరు చూసి ఎందుకు గ్రౌండ్ లెవెల్ కి ఇంకా దిగాజారుతున్నాడు అనే సందేహం కలుగుతుంది. ట్రైలర్ లో చూపించినంత ప్రామిసింగ్ గా సినిమా లేకపోవడం ముమ్మాటికి పూరి తప్పే. గదర్ సినిమా కథనే పునర్జన్మగా తిప్పి రాసుకుని ఇది చేసుంటాడు అని గతంలో వంకాయ సైట్ చెప్పిన జోస్యం ముమ్మాటికి నిజమైంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో హీరో తో పాకిస్తాన్ జిందాబాద్ చెప్పించే ప్రయత్నం యదాతధంగా అందులో నుంచే తీసుకున్నాడు.

అక్కడ సన్నీ డియోల్, అమ్రిష్ పూరి, ఇక్కడ ఆకాష్ పూరి, మురళి శర్మ. మిగిలినదంతా సేం టు సేం. హార్ట్ టచింగ్ గా ఉండాల్సిన పునర్జన్మ కథను డ్రాగ్ చేసి పాటలతో విసిగించిన పూరి సందీప్ చౌతా నుంచి కూడా సరైన అవుట్ పుట్ రాబట్టుకోలేదు.మొత్తానికి పూరి మార్క్ ఫెయిల్యూర్ ఇందులో కంటిన్యూ అయ్యింది.

సందీప్ చౌతా సంగీతం అంత గొప్పగా ఏమి లేదు. ఆడియోలో ఒక్కటంటే ఒక్క పాటకు కూడా రిపీట్ వేల్యూ లేదు. ఓ రెండు పాటలు పర్వాలేదు అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్ కు తగ్గట్టు ఇద్దామని ప్రయత్నించిన సందీప్ పూర్తిగా ట్రాక్ తప్పేసి ఒకప్పుడు నిన్నే పెళ్ళాడతా లాంటి క్లాసిక్ కు సంగీతం ఇచ్చింది ఇతనేనా అనే అనుమానం కలిగేలా చేస్తాడు. రియల్ సతీష్ యాక్షన్ కంపోజింగ్ బాగుంది. ఈ సినిమా చివరి దాకా కూర్చునే దాకా చేసింది అంటే అది ఒక్క విష్ణు శర్మ కెమెరా పనితనమే. విజువల్స్ ని అద్భుతంగా ప్రెజంట్ చేసాడు.

జునైద్ షేక్ ఎడిటింగ్ మాత్రం రెండో భాగంలో తప్పుడు లెక్కలు వేసింది. కథే అలా ఉన్నప్పుడు అతను మాత్రం ఏమి చేయలేడు. నిర్మాతగా పూరి సక్సెస్ అయ్యాడు. కొడుకు మీద ప్రేమో కథ మీద అతి నమ్మకమో కాని చాలా ఖర్చు పెట్టాడు. అది కంటికి కనిపిస్తుంది. రాజీ పడలేదు కాని ఆకాష్ లాంటి డెబ్యు హీరో మీద ఇంత డబ్బు పెట్టడం అంటే జూదం ఆడటమే. కాని పూరి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

పాజిటివ్ పాయింట్స్

ఆకాష్ పూరి నటన

కెమెరా పనితనం

రెండు పాటలు

ఇండో పాక్ బ్యాక్ డ్రాప్ 

నెగటివ్ పాయింట్స్

సిల్లీ కథా కథనాలు

సింక్ కాని పునర్జన్మ థ్రెడ్

సంగీతం

హీరొయిన్ నేహా శెట్టి

ఆర్టిస్టుల ఓవర్ యాక్షన్

చివరి మాట

పూరి జగన్నాధ్ ఈ సినిమాతో ఫాంలోకి వస్తాడు అని ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలు నెరవేరడం కష్టం. ప్రేక్షకుల తెలివి తేటలను తక్కువ అంచనా వేసిన ఏ దర్శకుడు అయినా ఇలాంటి కథతో హిట్టు కొట్టడం కాదు కదా కనీసం మంచి ప్రయత్నం చేసారులే అనిపించుకోవడం కూడా అసాధ్యం. ఒక మంచి నేపధ్యాన్ని తలాతోకా లేని లాజిక్ కి దూరంగా ఉన్న టేకింగ్ తో చిన్న పిల్లలతో సైతం ఇలా తీసారే అనిపించేలా ఉన్న మెహబూబాను మెచ్చుకోవాలంటే కరుడు గట్టిన గుండె కావాలి. పూరి ఆణిముత్యాలు అయిన రోగ్ లాంటి వాటి కంటే బాగుందా అంటే చెప్పడం కష్టం. ఆసిడ్ పడిన రెండు కళ్ళలో ఏది బాగా కనిపిస్తుందో చెప్పమంటే చెప్పగలమా. ఇదీ అంతే. అర్థం చేసుకున్న వాళ్ళకు అర్థం చేసుకున్నంత

మెహబూబా- తట్టుకోవడం కష్టమబ్బా

రేటింగ్ : 1.75/5

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE