నా పేరు సూర్య రివ్యూ

Updated By VankayaFri, 05/04/2018 - 10:36
Naa Peru Surya Naa Illu India Movie Review

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్. కేరళలో సైతం తనంటే పడిచచ్చిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బన్నీ మొదటిసారి మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు అనగానే ఆ ఆసక్తి రెట్టింపైంది. దానికి తోడు ఫస్ట్ లుక్ మొదలుకుని ట్రైలర్ దాకా అన్ని మంచి ఇంటెన్సిటీ తో ఉండటంతో ఇవాళ భారీ ఓపెనింగ్స్ రావడానికి అదే కారణం అయ్యింది. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ కథకుడిగా ట్రాక్ రికార్డు అందరికి తెలిసిందే కనక అతని టాలెంట్ మీద పెద్దగా సందేహాలు లేవు. మరి ఇన్ని అంచనాలు ఆశలు మోస్తున్న నా పేరు సూర్య వాటిని న్యాయం చేసేలా ఉన్నాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ
డెహ్రాడూన్ మిలిటరీ క్యాంప్ ట్రైనింగ్ లో ఉన్న సోల్జర్ సూర్య(అల్లు అర్జున్)కు కోపం ఎక్కువ. ఆ క్రమంలోనే అందరితో గొడవ పడుతూ ఉంటాడు. ఒక టెర్రరిస్ట్ ని కాల్చి చంపడంతో అతన్ని సస్పెండ్ చేస్తాడు కల్నల్ శ్రీవాత్సవ్(బోమన్ ఇరానీ). తిరిగి తీసుకోవాలంటే ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామ కృష్ణంరాజు(అర్జున్)సంతకం తీసుకుని రమ్మని చెబుతాడు.అతను ఎవరో కాదు. చిన్నప్పుడే గొడవ పడి విడిపోయిన సూర్య తండ్రి. అందుకోసం వైజాగ్ వస్తాడు సూర్య.

తాను సంతకం చేయాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని కండీషన్ పెడతాడు కృష్ణంరాజు. అప్పుడే అక్కడి లోకల్ డాన్ చల్లా(శరత్ కుమార్), కొడుకు(అనూప్ టాగోర్ సింగ్)లతో వైరం పెట్టుకుంటాడు. స్థానికంగా ఉండే మాజీ సైనికుడు ముస్తఫా(సాయి కుమార్)ను చల్లా కొడుకు హత్య చేసిన విషయంలో సూర్య సాక్షంగా నిలిచే పరిస్థితి వస్తుంది. అప్పటిదాకా 20 రోజులు కోపాన్ని అణుచుకుంటూ వచ్చిన సూర్య మాట మీద నిలిచే పరిస్థితి ఉండదు. ఆ సంఘర్షణను సూర్య ఎలా గెలిచాడు అనేదే నా పేరు సూర్య కథ. 

నటీనటులు 
మొదటి సినిమా గంగోత్రిని మినహాయిస్తే ఆర్య మొదలుకుని మొన్నటి డిజే దాకా తనకంటూ ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ స్టైల్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్ ఇందులో వాటన్నింటికి భిన్నంగా సరికొత్త అవతారంలో తనను తాను ఆవిష్కరించుకున్న తీరుకు నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాలి. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తీసుకోకుండా ఇలాంటి పాత్ర చేయటం ఒక రకంగా రిస్క్ అనే చెప్పాలి. దానికి వందకు రెండు వందల శాతం న్యాయం చేకూర్చాడు బన్నీ. యాంగ్రీ ఆర్మీ సోల్జర్ గా పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్నాడు. ఇలాంటి ప్రశంసకు అతను ఊరికే అర్హుడు కాలేదు.

హెయిర్ స్టైల్ మొదలుకుని తన ఫిజిక్ దాకా తన శరీరాన్ని మలుచుకున్న తీరు ఒక హై లైట్ అయితే సూర్య వ్యక్తిత్వాన్ని తన మాటల్లో మొహంలో హావభావాల ద్వారా పలికించిన తీరు నిజంగా అద్భుతం. రొటీన్ మూసలో పడేయకుండా తనతో కనక సరైన రీతిలో ప్రయోగాలు చేస్తే మనం ఎప్పుడు పోల్చుకుని ఈర్ష్య పడే తమిళ హీరోలకు ధీటుగా మనం కూడా చేయొచ్చని తన పెర్ఫోర్మస్ తో ఋజువు చేసాడు అల్లు అర్జున్.

టేకింగ్ పరంగా ఉన్న లోటుపాట్లని తన టైమింగ్ తో సాధ్యమైనంత మేర కవర్ చేసాడు బన్నీ. ఇప్పటికైతే ఇదే తన కెరీర్ బెస్ట్ అని చెప్పడంలో అనుమానం అక్కర్లేదు. తనను మిలిటరీ క్యాంప్ నుంచి వెలి వేసినప్పుడు, రావు రమేష్ దగ్గర ఎలాంటి సందర్భంలో సైనికుడు చనిపోవాలి చెప్పినప్పుడు, పందెం చివరి రోజు మానసిక సంఘర్షణకు లోనయ్యే సీన్స్, క్లైమాక్స్ లో అల్లు అర్జున్ నటన పీక్స్ అంతే. డాన్స్ కన్నా ఎక్కువగా బన్నీలో నటుడే కనిపించాడు అంటే దాని క్రెడిట్ మాత్రం వంశీకే ఇవ్వాలి. 

అను ఇమ్మానియేల్ లాంటి హీరొయిన్లకు ఇలాంటి కథలో నటనకు స్కోప్ దక్కడం చాలా తక్కువ. సూర్య ప్రియురాలిగా బాగానే సూట్ అయ్యింది కాని కథ డిమాండ్ మేరకు తనను ఎక్కువ వాడుకోలేకపోయాడు వంశీ. కాని తానున్న సీన్స్ లో ముఖ్యంగా పాటల్లో ఎంత చేయాలో అంతా చేసి పాస్ అయిపోయింది. హీరో తర్వాత అంతగా ప్రభావం చూపించే పాత్ర మాత్రం యాక్షన్ కింగ్ అర్జున్. చాలా కూల్ గా కనిపిస్తూ ప్రతిది క్యాలికులేటెడ్ మైండ్ తో ఆలోచించే పాత్రలో చాలా సెటిల్డ్ గా కనిపిస్తాడు. ఇతన్ని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకరు లేరు అనిపిస్తుంది. అంత బాగా చేసాడు అర్జున్.

కాకపోతే సినిమా మొత్తం ఈ పాత్ర క్యారీ అయినా డిజైన్ లో చేసిన లోపం వల్ల ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సీనియర్ నటుడు శరత్ కుమార్ చేసింది కొత్తది అనలేం కాని ఈ మద్య తెలుగు సినిమాల్లో ఆయన వేసిన పాత్రలతో పోల్చి చూస్తే మాత్రం ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. బన్నీలో అల్లు అర్జున్ తండ్రిగా పవర్ ఫుల్ పాత్రను చేసిన శరత్ కుమార్ ఇందులో చేసింది అంత వెయిటేజ్ ఉన్నది కాకపోయినా కథలో కీలకమైన విలన్ పాత్ర కావడంతో గుర్తుండిపోతాడు. అతని పక్కన అనుచరుడిగా ప్రదీప్ రావత్ సెట్ అయ్యాడు.

శరత్ కుమార్ కొడుకుగా చేసిన అనూప్ టాగోర్ సింగ్ కొంచెం ఓవరాక్షన్ తగ్గిస్తే మంచిది. అతన్ని ఏ సినిమాలో చూసిన ఒకరకమైన ఇబ్బంది కలగడానికి ఇదే కారణం అని చెప్పొచ్చు. ఇక యుద్ధంలో కాలు పోగొట్టుకున్న ఎక్స్ ఆర్మీ మెన్ గా సాయి కుమార్ పాత్ర మరీ పెద్దది కాదు కాని ఉన్న కాసేపు తన ఉనికిని చాటుకున్నాడు. వెన్నెల కిషోర్ కామెడీ పరంగా ఎక్కువ భారాన్ని మోసే అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. నదియాను గొప్పగా ఊహించుకుంటే నిరాశ తప్పదు. చాలా పరిమితులున్న హీరో తల్లి పాత్రలో ఆవిడ ఎక్కువ సేపు కనిపించదు.

సూర్యను గైడ్ చేసే సీనియర్ గా రావు రమేష్ ఉన్నది కొన్ని సీన్లే అయినప్పటికీ మంచి ఫీల్ ఉన్న పాత్ర కావడంతో ఓకే అనిపిస్తాడు. బోమన్ ఇరాని కూడా పరిమితంగా కనిపించే రోల్ లోనే కనిపిస్తాడు కాబట్టి నటన గురించి ప్రస్తావించే అవకాశం దొరకలేదు. పోసాని, ప్రభాస్ శీను తమకిచ్చిన పార్ట్ కు న్యాయం చేసారు. ఇక మిగిలిన నటీనటులు అంతా వీళ్ళు కాకుండా అదే పనిగా ప్రస్తావించే స్పేస్ అయితే దక్కించుకోలేదు

సాంకేతిక వర్గం 
ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే తన మొదటి సినిమాకు అందులోనూ స్టార్ హీరోతో అవకాశం దొరికినప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్ళకుండా ఇలాంటి కాన్వాస్ ఉన్న కథను ఎంచుకున్నందుకు దర్శకుడు వక్కంతం వంశీని మెచ్చుకోవాలి. రిస్క్ తీసుకోకుండా తనే కథ ఇచ్చిన రేస్ గుర్రం, ఎవడు, కిక్ లాంటి మసాలా ఫార్మాట్ లో కనక ఇది కూడా రాసుకుని ఉంటే తన ప్రత్యేకత ఏంటో తెలిసేది కాదు. అందుకే ఛాలెంజింగ్ గా తీసుకుని మరీ నా పేరు సూర్యని ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ హీరోకు ఉండాల్సిన మసాలాలు ఇందులో కూడా చేర్చాలని చేసిన ప్రయత్నమే కొంచెం తేడా కొట్టించింది.

ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీస్ వీలైనంత సీరియస్ గా ఎమోషనల్ గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. మాస్ ని టార్గెట్ చేసో లేక ఫాన్స్ ఫీల్ అవుతారనో ఏదైనా ఇరికించే ప్రయత్నం చేస్తే మాత్రం అవుట్ పుట్ లో మార్పు కనిపిస్తుంది. నా పేరు సూర్యలో జరిగింది అదే. మొదటి అరగంట హై వోల్టేజ్ యాక్షన్ అనే హామీ ఇచ్చిన వంశీ అది అవ్వగానే రొటీన్ ట్రాక్ లోకి పడిపోవడం కొంత ప్రభావం చూపించింది. కాకపోతే డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ కనక ఆ కొత్తదనం ఫీల్ అవుతున్న ప్రేక్షకుడు అది పసిగట్టే లోపు ఎగ్జైట్ చేసే మరో ఎపిసోడ్ తో మేనేజ్ చేసుకున్నాడు వక్కంతం వంశీ.

అనుమాన పడినట్టు ఇతను మరీ ఎక్కువ పొరపాట్లు చేయలేదు. తనకు దర్శకత్వం మీద ఎందుకు అంత ఇష్టం పెరిగిందో ప్రతి ఫ్రేంలో చూపించే ప్రయత్నం చేసాడు. ఆ తపన స్క్రీన్ ప్లే లో కనిపిస్తుంది. కానీ సింక్ కానీ లవ్ స్టొరీ, బ్రేక్ అప్ ఇదంతా అవసరమా అనిపించడం స్క్రీన్ ప్లే లోపమే. యుద్ధ నేపధ్యాన్ని ఊహించకుంటే మాత్రం అదేమి మచ్చుకైనా లేకపోవడం అసలు మైనస్. క్లైమాక్స్ హడావిడిగా చుట్టేసి లాజిక్ కి దూరంగా విలన్ అంత సులభంగా మారినట్టు చూపించడం అంత కన్విన్సింగ్ గా లేదు. మరీ సినిమాటిక్ గా ఉండటం కొంత డ్రామా నడిపిన ఫీలింగ్ కలగటంతో నాటకీయంగా ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో అవసరం లేని ప్రేమ కథతో టైం వేస్ట్ చేసిన వక్కంతం వంశీ సెకండ్ హాఫ్ టెంపోని ఫస్ట్ హాఫ్ అరగంట తర్వాత కంటిన్యూ చేసుంటే ఇదో గొప్ప సినిమా అయ్యేది. బట్ ఈసారి ఛాన్స్ మిస్ అయ్యింది. 

ఇక ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది రాజీవ్ రవి కెమెరా పనితనం గురించి. ఆర్మీ క్యాంపు, వైజాగ్ బ్యాక్ డ్రాప్ ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేని నేపధ్యాలని వేరు చేసి దర్శకుడి అంచనాలకు తగ్గట్టు సింక్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. పాటల్లో విజువల్స్ ని అద్భుతంగా తెరకెక్కించిన రాజీవ్ రవి యాక్షన్ సీన్స్ లో సైతం తనదైన మార్క్ చూపించాడు. విశాల్ శేఖర్ సంగీతం మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. అల్లు అర్జున్ డాన్సులు కనక వీటికి తోడవ్వకపోతే ఇవి జస్ట్ యావరేజ్ అనిపించే సాంగ్సే. బ్యాక్ గ్రౌండ్ తో మాత్రం బాగానే మేనేజ్ చేసారు.

కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ పనితనం బాగుంది కాని లెంగ్త్ విషయంలో రాజీ పడకుండా కొన్ని చోట్ల కత్తెర వేసింటే బాగుండేది.రామ్ లక్ష్మణ్, పీటర్ హైన్స్ ఫైట్స్ ఎప్పటి లాగే టాప్ స్టాండర్డ్స్ లో ఉన్నాయి, ముగ్గురు నిర్మాతల కలయిక కాబట్టి రాజీ అనే ప్రస్తావన రాకుండా చూసుకున్నారు. వక్కంతం వంశీ కన్నా బన్నీ అనే బ్రాండే ఈ సినిమాను అమ్ముతుంది కనక అది దృష్టిలో పెట్టుకుని అవసమైనంత బడ్జెట్ అలా పెట్టుకుంటూ పోయారు 

పాజిటివ్ పాయింట్స్ 
అల్లు అర్జున్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ 
యాక్షన్ సీన్స్ 
ఇంటర్వెల్ బ్లాక్
ముస్తఫా ఇంటి ఫైట్ 

నెగటివ్ పాయింట్స్ 
వార్ బ్యాక్ డ్రాప్ లేకపోవడం 
స్లో స్క్రీన్ ప్లే 
పాటలు 
కామెడీ

చివరి మాట 
నా పేరు సూర్య టైటిల్ తో నా పేరు ఇండియా క్యాప్షన్ ని ఆధారంగా చేసుకుని ఇదేదో గొప్ప దేశభక్తిని రగిలించే కథగా ఊహించుకుని వెళ్తే నిరాశ తప్పదు. ఉద్దేశం అదే అయినా ఫోకస్ మొత్తం ఫ్యామిలీకి దూరమైన ఒక సైనికుడు దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నమే కనిపిస్తుంది కనక ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీగానే చూడాలి. అంతకు మించి ఆశించినా కోరుకున్నా హాఫ్ మీల్స్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది.అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతృప్తి పడినా అది అందరికీ వర్తించాలని రూల్ లేదుగా. అలా కాకుండా జస్ట్ టైం పాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా చూడాలని అనుకుంటే ఒక లుక్ వేయొచ్చు. 

నా పేరు సూర్య- సగమే గెలిచిన యుద్ధం 

రేటింగ్: 2.5/5

 

In English :

Naa Peru Surya Movie Review

 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE