చల్ మోహనరంగా మూవీ రివ్యూ

Updated By VankayaThu, 04/05/2018 - 14:36
Nithiin's Chal Mohan Ranga Movie Review

యూత్ హీరో నితిన్ పాతికవ సినిమాగా కన్నా పవన్ కళ్యాణ్ నిర్మాతగా త్రివిక్రమ్ కథకుడిగా చేస్తున్న మూవీగా చల్ మోహనరంగా ముందు నుంచి ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ దాకా ఇది పూర్తిగా యూత్ బేస్డ్ లవ్ స్టొరీ అని స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ఓపెనింగ్స్ కూడా వాళ్ళతోనే నిండిపోయాయి. లై ఫలితం పెద్ద షాక్ ఇచ్చిన నేపధ్యంలో ఎటువంటి ప్రయోగాల జోలికి పోకుండా తనకు అచ్చి వచ్చిన తన బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే సాఫ్ట్ ఎంటర్ టైనింగ్ స్టోరీస్ వైపు యు టర్న్ తీసుకుని నితిన్ చేసిన మూవీ చల్ మోహనరంగా. బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ లేకుండా వచ్చిన చల్ మోహనరంగా నితిన్ ఫాన్స్ తో పవన్-త్రివిక్రమ్ అభిమానులను కూడా మెప్పించేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం పదండి 

కథ 
మోహనరంగా(నితిన్)హైదరాబాదీ కుర్రాడు. అమెరికా వెళ్ళాలనేది అతని లక్ష్యం. మూడు సార్లు వీసా రిజెక్ట్ అవుతుంది. అదే వీధిలో ఉండే జానకమ్మ(రోహిణీ హట్టంగడి)చనిపోతే ఆవిడ కొడుకులు అమెరికాలో ఉండటంతో శవాన్ని అక్కడికి తీసుకెళ్లే వంకతో అక్కడికి వెళ్తాడు మోహనరంగ. అక్కడ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా మేఘా సుబ్రమణ్యం(మేఘా) పరిచయమవుతుంది. స్నేహం కాస్త ప్రేమగా మారుతున్న టైంలో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేక విడిపోతారు. మేఘా తన  ఫ్యామిలీ ఉండే ఊటికి వెళ్ళిపోతుంది. రంగా ఎడబాటు భరించలేక ఉద్యోగం వదిలేసి ఇండియా తిరిగి వచ్చి మేఘా ఉన్న ఊరికే వస్తాడు. అక్కడ మేఘాను పెళ్లి కూతురిగా చూసి షాక్ అవుతాడు. కానీ రంగా వల్లే ఆ పెళ్లి ఆగిపోతుంది. అసలు ఏం జరిగింది, రంగా మేఘను తిరిగి కలుసుకునే ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యాయనేదే బాలన్స్ కథ.

నటీనటులు 
నితిన్ కు ఇందులో మోహనరంగా పాత్ర టైలర్ మేడ్ క్యారెక్టర్. ఇప్పటికే చాలా సినిమాల్లో చేసాడు కాని ప్రతి సారి ఇలాంటివే తనకు సూట్ అవుతాయి అనే అభిప్రాయాన్ని మాత్రం మరింత బలంగా మారుస్తాడు. చల్ మోహనరంగా పాత్ర కూడా ఇదే కోవలోకి వస్తుంది. కాకపోతే ఇంతకు ముందు సినిమాల్లో కామెడీ భారాన్ని పక్క ఆర్టిస్టుల మీద తోసేసి ప్రేమ వ్యవహరాలు చూసుకునే నితిన్ పాత్ర ఇందులో తను కూడా సమానంగా క్యారీ చేసే ప్రయత్నం చేయటమే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. నితిన్ తన వరకు తను చాలా ఈజ్ తో చేసుకుంటూ పోయాడు. వంక పెట్టడానికి ఎక్కడా స్కోప్ ఇవ్వలేదు. కాకపోతే కొన్ని చోట్ల వేగంగా హడావిడిగా డైలాగ్ చెప్పే విధానాన్ని కాస్త మార్చుకుంటే బెటర్. మిగిలినదంతా పర్ఫెక్ట్. అవసరం కోసం కాళ్ళు పట్టుకునే సీన్స్ లో కొంచెం ఓవర్ అనిపిస్తాడు. అది పక్కన పెట్టేస్తే నితిన్ ఈ కథకు యాప్ట్.

ఇక మేఘాఆకాష్ విషయానికి వస్తే ఇంకొన్ని అవకాశాలు దక్కితే నిలదొక్కుకునే హీరొయిన్ అవుతుంది అనిపిస్తుంది. లై కన్నా బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చే పాత్ర దొరకటం వల్ల దాన్ని పూర్తిగా వాడుకునే ప్రయత్నం చేసింది. కాకపోతే నటన పరంగా ఇంకొంచెం పరిణితి చెందాల్సి ఉంది. ఫిజిక్ పరంగా ఉండాల్సిన దాని కన్నా మరీ సన్నగా నాజూగ్గా ఉండటం కొంత వరకు మైనస్ అని చెప్పాలి. ఇక సీనియర్ నటి లిజి చాలా ఏళ్ళ తర్వాత తెలుగు తెరపై కనిపించింది. ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యారు అనే గొప్ప ఫీలింగ్ కలిగించలేదు కాని హీరొయిన్ తల్లిగా కొత్తగా కనిపిస్తున్నారే అనే అభిప్రాయం అయితే కలిగించారు.

రావు రమేష్ కు ఇది అలవాటైన వ్యవహారమే. తనే రాసిపెట్టుకున్న టెంప్లేట్ లో అలా చేసుకుంటూ పోయాడు. కామెడీ భారాన్ని హీరో తో పాటు మోసిన ఫ్రెండ్స్ బ్యాచ్ దాదాపు పూర్తి న్యాయం చేసారు. సత్య ఈ మధ్య ఓవర్ ఎగ్జైట్మెంట్ తో కొంత శృతి మించుతున్నాడు అనిపిస్తుంది కొన్ని సీన్స్ లో. బహుశా వాటిని డిజైన్ చేసిన రచయితది కూడా కొంత తప్పు ఉంది. డిఫరెంట్ టైమింగ్ తో అలరించే రఘునందన్ ఇందులో కూడా అదే కంటిన్యూ చేసాడు. నరేష్, సంజయ్ స్వరూప్, ప్రగతి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శీను, నర్రా శ్రీనివాస్, కిరీటి దామరాజు తెరనిండా నటీనటులు ఉన్నారు ఎంత కావాలో అంతే వాడుకున్నాడు దర్శకుడు కృష్ణచైతన్య. 

సాంకేతిక వర్గం 
త్రివిక్రమ్ ఇచ్చిన కథలో ఏ మాత్రం రిస్క్ లేదు. కేవలం డైలాగ్ టైమింగ్ ని ఆధారంగా చేసుకుని ఒక సింపుల్ లవ్ స్టొరీ ని ఆయన రాసిస్తే దర్శకుడు కృష్ణ చైతన్య దానికి సాధ్యమైనంత మేరకు న్యాయం చేసే ప్రయత్నం చేసాడు. నితిన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పినట్టు ఇది ఒక సాధారణ ప్రేమ కథ. గతంలో చాలా సార్లు చూసిందే. ఇలాంటి ప్రయత్నం ఇంతకు ముందు చూడలేదే అని మాత్రం ఎక్కడా అనిపించదు. కాకపోతే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికే దర్శకుడు కృష్ణ చైతన్య ఇంపార్టెన్స్ ఇవ్వడంతో కథనం-సంభాషణల మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. కాని ఇలాంటి లవ్ స్టోరీస్ ని మెప్పిస్తూ చెప్పాలంటే పెన్ పవర్ చాలా ఇంపార్టెంట్.

కాని విచిత్రంగా కృష్ణ చైతన్య పూర్తిగా త్రివిక్రమ్  స్టైల్ లో వెళ్ళిపోవడం వల్ల డైలాగ్స్ లో ప్రాస విన్నప్పుడు ఇది ఇద్దరు కూర్చుని రాసారా లేక త్రివిక్రమ్ కథతో పాటు మాటలు కూడా రాసిచ్చారా అనే అనుమానం కలుగుతుంది. ఎంత రెగ్యులర్ గా అనిపించే స్టొరీ అయినా బోర్ కొట్టించకుండా నడిపించే ప్రయత్నంలో కృష్ణ చైతన్య పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో అమెరికా ఎపిసోడ్ మొత్తం జస్ట్ టైం పాస్ అనిపిస్తుంది. ఇందులో అంత స్పెషల్ ఏముంది అనే కామెంట్ చేయకుండా మాత్రం ఉండనివ్వదు. రంగా మేఘాలు కలుసుకోవడానికి చాలా సులభమైన అవకాశాలు ఉన్నా కేవలం సాగదీయటం కోసమే ఇద్దరి మధ్య గ్యాప్ చూపించే సీన్స్ అన్ని డ్యూరేషన్ పెంచడం కోసం తప్ప ఇంకేమి లేదు. కామెడీ అక్కడక్కడ పండింది కానీ మొత్తానికి ఏ మలుపులు లేకుండా ఫ్లాట్ గా సాగటమే మైనస్. తనలో ఉన్న రైటర్ తో పాటు టెక్నీషియన్ కు ఇంకా పని చెప్పాల్సింది దర్శకుడు.

తమన్ మ్యూజిక్ మరీ గొప్పగా లేదు కాని ఈ సినిమాకు ఎంత కావాలో అంత ఇచ్చినట్టు ఉంది. రెండు పాటలు మినహాయిస్తే మిగిలినవి స్క్రీన్ నుంచి బయటికి వచ్చాక గుర్తుండవు. నేపధ్య సంగీతం మాత్రం మంచి ఫీల్ తో ఇచ్చాడు. నటరాజా సుబ్రహ్మణ్యం కెమెరా పనితనం మాత్రం హై స్టాండర్డ్స్ లో ఉంది. అమెరికా నేపధ్యంతో పాటు గోవా విజువల్స్ ని అద్భుతంగా షూట్ చేసాడు. సెల్వ-రవి వర్మ ఫైట్స్ ఓకే అనిపిస్తాయి. శేఖర్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. బ్రాండ్ వేల్యూ కోసమే తప్ప సుధాకర్ రెడ్డితో పవన్-త్రివిక్రమ్ జత కలవాల్సినంత భారీ బడ్జెట్ అయితే కాదు. ఎవరో ఒకరే ఈజీగా భరించే ఖర్చులోనే సినిమా అయిపోయింది. కాకపోతే రిచ్ గా రావడంలో మాత్రం రాజీ పడలేదు 

ప్లస్ పాయింట్స్ 
నితిన్-మేఘా జంట 
కామెడీ సీన్స్ 
కెమెరా వర్క్ 
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ 
రొటీన్ స్టొరీ 
ఊహించగలిగే మలుపులు 
పంచుల కోసం ప్రయాస 
సాగతీత అనిపించే కథనం 
సెకండ్ హాఫ్

చివరి మాట 
చల్ మోహనరంగా డీసెంట్ గా అనిపించే సింపుల్ లవ్ స్టొరీ. తెలిసిన కథను తెలిసిన రీతిలో విసిగించకుండా  చేసిన ప్రయత్నం. ఊహకు అతీతంగా ఇందులో ఏది జరగదు. క్లైమాక్స్ తో సహా అంతా అంచనాలకు అనుగుణంగానే సాగుతుంది. కాకపోతే సంభాషణలతో ఏదైతే నవ్వించే ప్రయత్నం చేసారో అది మాత్రం పూర్తిగా కాకపోయినా పాక్షికంగా నెరవేరింది. సరదాగా సమయం గడిచిపోతే చాలు కొత్తదనం ఏమి అక్కర్లేదు అనుకుంటే చల్ మోహనరంగా కొంతవరకు నిరాశ పరచదు. ఇలాంటి కథలతో వచ్చిన బ్లాక్ బాస్టర్స్ సరసన నిలవదు కాని ఈ సీజన్ లో ఇలాంటి హెల్తి ఎంటర్ టైనర్స్ తక్కువగా వస్తున్నాయి  కనక ఆ రకంగా చూసుకుంటే ఒక లుక్ వేయొచ్చు తప్ప డోంట్ మిస్ క్యాటగిరీ మూవీ అయితే కాదు.

చల్ మోహనరంగా- 'డల్' గా 'స్లో' గా 'లవబుల్' గా చల్ అనిపించుకుంది

రేటింగ్ : 2.75/5

 

In English :

Nithiin's Chal Mohan Ranga Movie Review

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE