రంగస్థలం మూవీ రివ్యూ

Updated By VankayaFri, 03/30/2018 - 09:31
Rangasthalam Movie Review

ధృవ తర్వాత ఏడాది పైగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా కాబట్టి రంగస్థలంపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. గ్రామీణ నేపధ్యంలో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఎవరూ చేయకపోవడం కూడా దీనికి పెద్ద ప్లస్ గా మారింది. రామ్ చరణ్ గెటప్, సమంతా మేకోవర్,మూవీకి సంబంధించిన విజువల్స్ అన్ని దీని మీద ఆసక్తి పెరుగుతూపోయేలా చేసాయి. దాని తోడు మాస్ ని మెప్పించే సినిమా ఏది ఈ ఏడాది ఇప్పటి దాకా రాకపోవడం కుడా రంగస్థలంకు కలిసి వచ్చింది. మరి ఇన్నేసి అంచనాలు అందుకునేలా రంగస్థలం ఉందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

అనగనగా రంగస్థలం అనే పల్లెటూరు. ఆ ఊళ్ళో డబ్బులు తీసుకుని పొలాలకు ఇంజిన్ తో నీళ్ళు వదిలే పని చేస్తుంటాడు చిట్టిబాబు(రామ్ చరణ్). దుబాయ్ నుంచి అన్నయ్య కుమార్ బాబు(ఆది పినిశెట్టి)సెలవులకు ఊరికి వస్తాడు. ఊరిని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజల ఆస్తులను దోచుకుని అప్పుల పేరిట వాళ్ళను జలగల్లా పీల్చుకుతినే ప్రెసిడెంట్ ఫణింద్ర భూపతి(జగపతిబాబు). 30 ఏళ్ళుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ ఎవరు నామినేషన్ వేయకుండా చూసుకుంటూ ఉంటాడు. చిట్టి బాబు ప్రేమించిన రామలక్ష్మి(సమంతా)పొలాన్ని కూడా ప్రెసిడెంట్ జప్తు చేయటంతో కుమార్ బాబు ఊరు బాగుపడాలంటే ప్రెసిడెంట్ ను దించాలని నామినేషన్ వేస్తాడు. అతనికి మద్దతుగా నిలుస్తాడు అపోజిషన్ పార్టీ నాయకుడు దక్షిణామూర్తి(ప్రకాష్ రాజ్). ఊళ్ళో రాజకీయాలు మొదలవుతాయి. కుమార్ బాబు హత్య జరిగాక ప్రెసిడెంట్ మాయమవుతాడు. దక్షిణామూర్తికి ఆక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్తాడు.దీనికి కారణం ఎవరు అనే వెతికే పనిలో ప్రతీకారం కోసం తిరిగిన చిట్టిబాబు చివరికి తన అన్నయ్యను చంపిన హంతకుడిని వేటాడి పట్టుకోవడమే రంగస్థలం కథ

నటీనటులు

రామ్ చరణ్ తో పాటు యూనిట్ మొత్తం ముందు నుంచి చెప్పినట్టు ఇది అతని కెరీర్ బెస్ట్. అందులో ఏ మాత్రం అనుమానం అక్కర్లేదు. చిరంజీవి వందకు పైగా సినిమాలు చేసినా రుద్రవీణ, స్వయంకృషి ఎంత ప్రత్యేకంగా నిలుస్తాయో పెర్ఫార్మన్స్ పరంగా రంగస్థలం రామ్ చరణ్ కు అలా నిలిచిపోతుంది. అందులో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. తనకే తెలియని యాక్టింగ్ టాలెంట్ ని సుకుమార్ పూర్తిగా బయటికి తీసాడు. చెవులు వినపడని పాత్రలో, అన్నయ్య కోసం ఏదైనా చేసే తమ్ముడిగా మోటుగా ఉండే చిట్టిబాబుగా రామ్ చరణ ది బెస్ట్ ఇచ్చాడు. అందులో అనుమానం అక్కర్లేదు.

సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా చరణ్ తన విశ్వరూపం చూపించాడు. క్లైమాక్స్ సీన్ లో ఫాన్స్ నే కాదు ప్రేక్షకులను సైతం మెప్పిస్తాడు. కథల ఎంపికలో వైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్న రామ్ చరణ్ ఇదే ధోరణి కొనసాగిస్తే మూసలో కొట్టుకుపోకుండా ఒక మంచి హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. మెగా బ్రాండ్ ఉన్నా అది మర్చిపోయేలా తన గ్రేస్ తో మెప్పించాడు. జిగేల్ రాణి పాటలో తప్ప స్టెప్స్ వేసే అవకాశం పెద్దగా రాలేదు కనక దాని గురించి కామెంట్స్ అవసరం లేదు. ఇక ఫస్ట్ హాఫ్ మాత్రమే ఎక్కువగా కనిపించే సమంతా రామ్ చరణ్ కు పోటీగా ఆదరగొట్టింది. చాలా క్యూట్ గా ముద్దొచ్చే మాటలతో తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎక్స్ ప్రెషన్స్ తో సింప్లీ సూపర్ అనిపించింది కాని ఫాన్స్ మాత్రం సెకండ్ హాఫ్ లో తన పాత్ర పూర్తిగా తగ్గిపోవడం వల్ల  హర్ట్ అవుతారు. 

ఆది పినిశెట్టి సపోర్టింగ్ రోల్ లో జీవించాడు. దాదాపు ముప్పాతిక సినిమా రామ్ చరణ్ తో సమానంగా జర్నీ చేసే పాత్ర కాబట్టి ఇతనితో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. పాత్ర ముగింపు కథా పరంగా జరిగింది కాబట్టి అసంతృప్తిని భరించాలి. ఆదికి కూడా ఇదే కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. విలన్ జగపతి బాబు తనకు అలవాటైన రీతిలో దుర్మార్గుడైన ప్రెసిడెంట్ గా తనకు మోడరన్ విలనీలో ఎవరు సాటి లేరని మరోసారి నిరూపించాడు. రంగమ్మత్తగా అనసూయ ఫస్ట్ హాఫ్ లో మంచి హడావిడి చేసింది కాని ఇంటర్వెల్ అయ్యాక పెద్దగా కనిపించకపోవడం కొంత మైనస్. అనసూయ పర్ఫెక్ట్ గా నప్పింది ఆ పాత్రకు. ప్రకాష్ రాజ్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. హీరో తల్లితండ్రులుగా నరేష్, రోషిణి బాగా కుదిరారు. విలన్ అనుచరుడిగా అజయ్ ఘోష్ బాగున్నాడు. శతమానం భవతి మహేష్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల,  ఊళ్ళో ఉండే ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరు ఎవరి పాత్ర పరిధి మేరకు వాళ్ళు మెప్పించారు

సాంకేతిక వర్గం

సుకుమార్ సినిమా అంటే మేధస్సుకు పరీక్ష. ఈ మార్క్ పోవాలనే కాబోలు సుకుమార్ ఒక మామూలు పల్లెటూరి నేపధ్యాన్ని కథగా తీసుకున్నాడు అనిపిస్తుంది. కథగా చూసుకుంటే ఇది ఏనాడో అరిగిపోయిన ఫార్ములా. కాకపోతే ఫోర్ జి టెక్నాలజీలో మానవ సంబంధాలను మరచిపోతున్న మనకు పాతలో కలిసిపోయిన ఒక కొత్త ప్రపంచాన్ని చూపించడానికి సుకుమార్ ఈ నేపధ్యాన్ని వాడుకున్నాడు తప్పించి ఇందులో కథ పరంగా కొత్తదనం ఏమి లేదు. కాని సుకుమార్ లో గొప్ప టెక్నీషియన్ ఉన్నాడు. అతనికి టాలీవుడ్ లో ఇంత పేరు రావడానికి కారణం కూడా అదే.

రంగస్థలం కాన్వాస్ ని సెట్ చేసుకున్న తీరు, పాత్రలు రాసుకున్న విధానం అన్ని టాప్ స్టాండర్డ్ లో ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రల నేపధ్యం పరిచయానికే వాడుకున్న సుక్కు అసలు కథ సెకండ్ హాఫ్ లోనే చెప్పాలని డిసైడ్ కావడం కొంచెం ఇబ్బంది పెట్టింది. ప్రెసిడెంట్ కు ఎదురెళ్ళిన అన్నయ్య చావుకు కారణమైన వాళ్ళను పట్టుకుని చంపే ఒక యువకుడి ప్రతీకార కథే రంగస్థలం. ఇంత చిన్న పాయింట్ మీద మూడు గంటల సేపు ఒకే వాతావరణంలో చివరి దాకా కూర్చోపెట్టడం అంటే సాహసమే. ఇందులో సుకుమార్ చాలా మటుకు సక్సెస్ అయ్యాడు. కాని సాగతీత అనిపించే అవకాశాలు చాలానే ఇచ్చిన సుకుమార్ ఫస్ట్ హాఫ్ లో టైం వేస్ట్ చేయటం సెకండ్ హాఫ్ మీద ఎఫెక్ట్ చూపించింది.

అన్నయ్య అంటే అంత ప్రాణమిచ్చే చిట్టిబాబు ప్రెసిడెంట్ దగ్గర డబ్బులు తీసుకుని అన్నయ్య ప్రాణం మీదకు వచ్చేసరికి తిరిగి ఇచ్చే ఎపిసోడ్ అంతగా కన్విన్సింగ్ గా అనిపించదు. అక్కడ డౌన్ అయిన గ్రాఫ్ తిరిగి క్లైమాక్స్ ముందు నుంచి మాత్రమే కోలుకుంటుంది. కుమార్ బాబు చనిపోయాక జరిగే తతంగాన్ని అరవ స్టైల్ లో అంత సేపు చూపించాల్సిన అవసరం లేదు. ఎమోషన్ ఇంకా బలంగా రిజిస్టర్ చేయటం కోసం జరిగే ప్రయత్నమే అయినప్పటికీ అది కొంత అసహనాన్ని కలిగిస్తుంది. ఎవరు నామినేషన్ వేసినా క్షణాల్లో చంపించే ప్రెసిడెంట్ ఊళ్లలో అందరు వార్డ్ మెంబెర్లు గా సంతకాలు పెడుతూ ఉంటే చూస్తూ ఉండిపోవడం సినిమాటిక్ లిబర్టీ అయినప్పటికీ అంత క్రూరుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని ప్రేక్షకుడికి డౌట్ వస్తుంది.

అక్కడ మొదలు అన్నదమ్ముల మధ్య డ్రామా తప్ప అసలైన రాజకీయ మలుపులు ఏమి ఉండకపోవడం సోల్ ని కొంత దెబ్బ తీసింది. ఇంత జరిగినా టెక్నికల్ గా అద్భుతంగా తీసిన సుకుమార్ ఈ ఒక్క కారణంగానే థియేటర్ లో చివరి దాకా కూర్చోవడానికి ఒక కారణం ఇచ్చాడు. మాస్ కి కిక్ ఇచ్చే ఎలివేషన్ ఎపిసోడ్స్ చప్పగా సాగిపోవడం కూడా మైనస్ గా నిలిచింది. దీనికి రామ్ చరణ్ హీరో అయితే మరో హీరో రత్నవేలు. చాలా పరిమితంగా ఉన్న లొకేషన్ రిస్త్రిక్షన్ కి కట్టుబడి తన కెమెరాతో వావ్ అనిపించాడు. పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరుకు హాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఆడియో గానే కాక సుకుమార్ టేకింగ్ లో వీడియోలో కూడా కనువిందుగా ఉన్నాయి. కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్వాలేదు అనే ఫీలింగ్ ఇస్తుంది తప్ప గొప్పగా అనిపించదు. ఆర్ట్ వర్క్ చేసిన రామకృష్ణ-మౌనిక రంగస్థలంకు వెన్నెముక. వాళ్ల కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు  ఎక్కడా రాజీ పడినట్టు కనిపించలేదు

పాజిటివ్ పాయింట్స్

రామ్ చరణ్, ఆది పినిశెట్టి

సమంతా యాక్టింగ్

రత్నవేలు కెమెరా

పాటలు

ఆర్ట్ వర్క్

నెగటివ్ పాయింట్స్

సెకండ్ హాఫ్ సాగతీత

లెంగ్త్

సింపుల్ స్టొరీ లైన్ 

నాలుగు పాత్రల మీదే దృష్టి పెట్టడం 

చివరి మాట

రంగస్థలం లాంటి ప్రయత్నాలు ఎప్పుడు జరిగేవి కావు. అందుకే ఇది ముందు నుంచి చాలా ప్రత్యేకంగా నిలుస్తూ వచ్చింది. అంచనాలు అందుకుందా లేదా అనే విషయం పక్కన పెడితే కమర్షియల్ చట్రం నుంచి బయటికి వచ్చి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో చేసిన ఈ ప్రయోగం ఖచ్చితంగా చూసే క్యాటగిరీలో వేసేదే. పల్లె రాజకీయాలను బ్యాక్ డ్రాప్ లో తీసుకున్నా మరీ ఊపిరిసలపలేనంత మలుపులు లేకపోవడం కొంత నిరాశ కలిగించినా రొటీన్ ఫార్ములా సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కొంత రిలీఫ్ ఇచ్చే ప్రయత్నంగా రంగస్థలం పాస్ మార్కులైతే తెచ్చుకుంది. ఇప్పటి తరానికి తెలియని ఒక కొత్త వాతావరణంలో ఊహాజనితం అనిపించే కనుమరుగైన వాస్తవిక గ్రామీణ ప్రపంచంలో ఓసారి తిరిగి రావడానికైనా రంగస్థలంపై ఒక చూపు వేయొచ్చు

రంగస్థలం – కొన్ని లోపాలతో నాటకం రక్తి కట్టింది 

రేటింగ్ : 2.75/ 5

 

In English :

Ram Charan Tej's Rangasthalam Movie Review

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE