ఆ డైరెక్టర్ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారా

Updated By VankayaThu, 01/25/2018 - 17:11
These director doing publicity stunt

అతను పేరున్న దర్శకుడు. ఒకప్పుడు సింపుల్ టీనేజ్ లవ్ స్టోరీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపించిన టాలెంట్ అతనిది. కెరీర్ ని కెమెరామెన్ గా స్టార్ట్ చేసి ప్రముఖ దర్శకుల సినిమాలకు పని చేసి అంచెలంచెలుగా ఇప్పుడున్న స్థితికి చేరాడు. ఆ మధ్య ఓ ఏడెనిమిదేళ్ళు హిట్టు మొహం చూడని ఆయన లాస్ట్ ఇయర్ ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో మళ్ళి ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఇద్దరు క్రేజీ సీనియర్ హీరోల ప్రాజెక్ట్స్ ఒకేసారి ఇతని చేతిలో ఉన్నాయి. అందులో ఒకరికి అన్నయ్య నడిపిస్తున్న స్వంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ బ్యానర్ నిర్మాణంలోనే ఇప్పుడు తీస్తున్న సినిమా నిర్మాణమవుతోంది. తాజాగా సదరు డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా తనకు కాస్టింగ్ కావాలని సోషల్ మీడియాలో ఓపెన్ కాల్ ఇచ్చాడు. అన్ని వయసుల వాళ్ళు కావాలని ఆడిషన్స్ కి రమ్మని చెప్పి మూడు రోజుల వర్క్ షాప్ పెట్టేసారు.

ఇంకేముంది తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి ఆ పోస్ట్ చూసి తండోపతండాలుగా జాతరను తలపించేలా ఆడిషన్ కు వచ్చారు.గతంలో తన కెరీర్ ప్రారంభంలో తీసిన ఒక లవ్ స్టొరీకి కొత్త హీరో కావాలని చెప్పి  ఇలాగే ఆడిషన్ చేసిన ఆ దర్శకుడు చివరికి ప్రఖ్యాత డిస్ట్రిబ్యూటర్  కొడుకునే హీరోగా పెట్టి తీసాడు. అప్పుడు టెస్ట్ కు వచ్చిన వాళ్ళలో అతి కొద్ది మంది మాత్రమే సెలెక్ట్ చేసారు. ముందే హీరో ఎవరో డిసైడ్ చేసుకుని ఆడిషన్ పేరిట పబ్లిసిటీ చేసారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ సినిమా నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌస్ కి స్వంతంగా ఒక ఫిలిం స్కూల్ ఉంది. ఎందరో అక్కడ యాక్టింగ్, డైరెక్షన్ కోర్సులు పూర్తి చేసి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు. వాళ్ళను కాదని సోషల్ మీడియాను ఉపయోగించి బయట వాళ్ళను పిలిపించడం ఎంటనే విమర్శలు ఇప్పుడు మొదలయ్యాయి. సెలెక్ట్ అవుతామనే నమ్మకంతో వందల సంఖ్యలో ఆ స్టూడియో దగ్గర ఆడిషన్ కోసం స్వంత ఖర్చులతో వచ్చిన వారిని చూస్తే అయ్యో పాపం అనిపించక మానదు. ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ అని, అప్పుడు చేసినట్టుగానే బయటి వాళ్ళను తీసుకోరని, ఆ దర్శకుడి తీరు తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ఇంత దూరం వచ్చిన వాళ్ళతో ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయకుండా ఉండాల్సిందని అంటున్న వారూ లేకపోలేదు. దీనికి సమాధానం దొరకటం కష్టమే కాని ప్రస్తుతం దీని గురించి ఫిలిం నగర్ లో తీవ్ర చర్చ జరుగుతోంది. 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE