జగన్ డెడ్ లైన్ కు కారణం ఇదేనా?

Updated By VankayaWed, 02/14/2018 - 10:34
These reason for Jagan deadline?

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే.. ఏప్రిల్ 6 న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత సంచలన ప్రకటన చేసిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజుకుంది. జగన్ ప్రకటనతో.. టీడీపీ, బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తూ.. జేఏసీ పేరుతో జనం దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్న జనసేన పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు రాజకీయాలకు కొత్త దారులు వెతుక్కోవాల్సి వచ్చింది.

ఇంతగా రాజకీయ కలకలం రేపిన జగన్ ప్రకటన వెనక అసలు కారణమేంటి? ఇప్పటికిప్పుడు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టడానికి కారణం ఏంటని ఆలోచిస్తే.. ఇదిగో ఇందుకూ.. అని రాజకీయ విశ్లేషకులు వివరణ ఇస్తున్నారు. అందులో మొదటి కారణం.. కేంద్రానికి ఇదే పూర్తి స్థాయి ఆఖరి బడ్జెట్. అంటే.. వచ్చే ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వానికి ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో.. నేరుగా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేయొచ్చు. కేంద్రం ఈ విషయంలో కచ్చితంగా ఏదో ఒక విషయాన్ని స్పష్టం చేయవచ్చు.

రెండో కారణం.. కేంద్రం వ్యవహారశైలికి అనుకూలంగా ప్రవర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చు. హోదా ఇవ్వకుండా.. సమస్య రాజుకుంటుందన్న మాటను టీడీపీ నేతలతోనే చెప్పించి.. ఆ హోదాను సాధించేలా చేసి చివరికి రాష్ట్ర ప్రజలకు మేలు చేయవచ్చు.

మూడో కారణం.. ఎప్పుడు ప్రజా సమస్యలు ప్రస్తావించినా.. ఎప్పుడు హోదా విషయాన్ని లేవనెత్తినా.. పవన్ కల్యాణ్ అనే రాజకీయ ఆటలో అరటిపండు ప్రత్యక్షమవుతున్నారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకే క్లారిటీ లేనంతగా ప్రశ్నిస్తుంటారు. ఈ అయోమయానికి తెరదించి.. నేరుగా గన్ షాట్ పాయింట్ ను కేంద్రానికి తగిలేలా చేయవచ్చు. తద్వారా.. పవన్ కల్యాణ్ కూడా స్పష్టమైన వైఖరితో హోదాపై పోరాడవచ్చు.

నాలుగో కారణం.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? ఓ రకంగా ఇదే అసలు కారణం. ఇప్పుడు హోదా రాకపోతే.. తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం హోదా ఇవ్వకపోతే.. ఇక భవిష్యత్తులో ఈ విషయం కలగానే మిగిలిపోవడం ఖాయం. అందుకే.. జగన్ తెగించి మరీ.. రంగంలోకి దిగారు. తన పార్టీ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధుల రాజకీయ జీవితాలను పణంగా పెట్టి మరీ.. సవాల్ విసిరారు.

ఇన్ని సున్నితమైన విషయాలు దాగున్నాయి కాబట్టే.. జగన్ సవాల్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా.. దాగుడుమూతలు ఆడుతున్నాయి.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE