
సంస్కృతి.. సంప్రదాయం గురించి నిత్యం నీతులు చెప్పే ఎంపీ ఒకరు నైట్ క్లబ్ స్టార్ట్ చేయటాన్ని ఊహించగలమా? ఇలాంటి సిత్రాలు మరే పార్టీ ఎంపీ చేసినా జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే.. ఊహించని విధంగా గత కొంతకాలం వరకూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఓపెనింగ్ చేసిన వ్యాపారం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సంస్కృతి.. సంప్రదాయాల గురించి తరచూ మాట్లాడే ఆయన లెట్స్ మీట్ పేరిట నైట్ క్లబ్ ను ఒకదాన్ని స్టార్ట్ చేయటం సంచలనంగా మారింది. ఇప్పటికే బీజేపీ ఎంపీలు.. ఎమ్మెల్యేల వ్యవహారంతో తల బొప్పి కట్టిన యోగి సర్కారుకు తాజాగా సాక్షి మహారాజ్ చేసిన పని మింగుడుపడనిరీతిలో మారింది.
లక్నో లోని జీత్ ప్లాజా క్లాంపెక్స్ లో ఆదివారం రాత్రి ఈ క్లబ్‌ను ఘనంగా స్టార్ట్ చేశారు. ఉన్నావ్ లో మైనర్ బాలికపై బీజేపీ ఎంపీ కుల్దీప్ సింగ్ రేప్ చేసిన వైనం దేశ వ్యాప్తంగా రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. జరుగుతున్న పరిణామాలతో తనకు సంబంధం లేనట్లుగా సాక్షి మహారాజ్ నైట్ క్లబ్ ను స్టార్ట్ చేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో యువతీయువకుల అసభ్య ప్రవర్తన కారణంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించిన సంచలనం రేపిన సాక్షి మహారాజ్ తాజాగా నైట్ క్లబ్ ప్రారంభించటం గమనార్హం. కాలం అందరిని మారుస్తుందంటారు. అందుకు సాక్షి మహారాజ్ మినహాయింపు కాదని తాజా ఉదంతంతో తేలిపోయింది. కాలంతో పాటు మార్పు రావటం మంచిదే అయినా.. సాక్షి ఎంచుకున్న టైమింగ్ బాగోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.