తొలిప్రేమ మూవీ రివ్యూ

Updated By VankayaSat, 02/10/2018 - 13:59
Tholi Prema Review

ఫిదా ఇచ్చిన సక్సెస్ కిక్ తో జోష్ మీద ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దాని తరువాతి సినిమా హిట్ అయ్యే తీరాలి అనే లక్ష్యంతో చేసిన సినిమా తొలిప్రేమ. ఫిదా సక్సెస్ లో మేజర్ షేర్ సాయి పల్లవి తీసేసుకుంది కాబట్టి వరుణ్ తేజ్ తన పేరు మీద, తన వల్ల విజయం సాధించే మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమాటకొస్తే ఫిదా కంటే ముందు వరుణ్ ఖాతాలో ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నప్పటికీ కమర్షియల్ గా ఇంకా తన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కు చూపించలేదు. ఈ నేపధ్యంలో వచ్చిన తొలిప్రేమపై టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. మరి వాటిని అందుకునే రేంజ్ లో ఉందో లేదో చూద్దాం 

కథ 

వైజాగ్ లో ఇంటర్ చదువు పూర్తి చేసుకున్న ఆదిత్య(వరుణ్ తేజ్)ట్రైన్లో హైదరాబాద్ కు వెళ్తున్న టైంలో వర్ష(రాశి ఖన్నా)తో పరిచయం మొదలై తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఇద్దరు ఒకే ఇంజినీరింగ్ కాలేజ్ లో చేరతారు. స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. వర్ష విషయంలో అదిత్యకు సీనియర్ తో వచ్చిన గొడవ ప్రిన్సిపాల్ దాకా వెళ్ళడంతో ఇద్దరి మధ్య ఈగో క్లాష్ వచ్చి బ్రేకప్ చెప్పుకుంటారు. కట్ చేస్తే ఆరేళ్ళ తర్వాత వర్షకు పేరెంట్స్ హైదరాబాద్ లో సంబంధాలు వెతుకుతూ ఉండగా ఆదిత్య లండన్ వెళ్లి ఆర్కిటెక్చర్లో మాస్టర్ డిగ్రీ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా వర్ష ప్రాజెక్టు మేనేజర్ గా ఆదిత్య ఉన్న కంపెనీకి లండన్ కు వస్తుంది. తొలిప్రేమ రెండో సారి ఎలా మొదలైంది, ఎలా మలుపులు తీసుకుంది అనేది కీలకమైన సెకండ్ హాఫ్.

నటీనటులు 

వరుణ్ తేజ్ కెరీర్ పరంగా చాలా తెలివైన అడుగులు వేస్తున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చాను కాబట్టి మాస్ సినిమాలే చేయాలి అనే కండిషన్ పెట్టుకోకుండా ఇలాంటి మెచ్యుర్డ్ లవ్ స్టోరీస్ చేయటం యూత్ లో ఇతని ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఉపయోగపడేదే. తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ కాని కథలు ఎంచుకుని అనక ఇబ్బంది పడటం లోఫర్, మిస్టర్ లాంటి సినిమాలతో అనుభవమైన వరుణ్ తొలిప్రేమ విషయంలో చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు.

నటనలో కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగు కనిపిస్తుంది.ఫిదాలో సాయి పల్లవి డామినేట్ చేసిన మాట నిజం. ఆ పాత్ర తీరే అంత కాబట్టి వరుణ్ తేజ్ కు కూడా ఎక్కువ స్కోప్ దక్కలేదు. ఇందులో మాత్రం చాలా కంఫర్టబుల్ గా చాలా ఈజ్ తో వేరియేషన్స్ ఉన్న పాత్రను అవలీలగా చేసుకుంటూ పోయాడు. ఆదిత్యగా మంచి నటుడిని చూపించాడు. డాన్స్ విషయంలో కొంత శ్రద్ధ పెట్టిన వరుణ్ ని ఈ ఒక్క విషయంలో మాత్రం మిగిలిన మెగా హీరోలతో పోల్చకపోవడం బెటర్. 

ఇక రాశి ఖన్నా విషయానికి వస్తే తనో పెద్ద సర్ప్రైజ్. ఫ్రెష్ నెస్ కోసం సాధారణంగా ఇలాంటి ప్రేమ కథలకు కొత్త హీరొయిన్ అయితేనే బాగుంటుంది. అందరు ఫాలో అయ్యే ట్రెండ్ ఇదే. కాని దానికి భిన్నంగా ఐదేళ్ళు సీనియారిటీతో గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎక్కువ చేసిన రాశి ఖన్నాను తీసుకున్నప్పుడు అందరికి కలిగిన అనుమానం తను సూట్ అవుతుందా అని. ఆశ్చర్యకరంగా రాశి మెప్పించింది.

ఈ పాత్ర కోసమే తాను ప్రత్యేకంగా బరువు తగ్గి ఫిజిక్ మీద శ్రద్ధ చూపించాను అని చెప్పిన మాట నిజమే. దానికి తగట్టు మంచి పెర్ఫోర్మస్ తో కట్టి పడేసింది. చూస్తున్నంత సేపు రాశి ఖన్నా లాగా కాకుండా వర్షలా మాత్రమే కనిపించడం తన టాలెంట్. రాశిని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేని గొప్పగా చేసింది. తనను ఇన్నాళ్లు ఎంత వృధా చేసుకున్నారో వెంకీ అట్లూరి నిరూపించాడు. 

హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి పెళ్లి చూపులు స్థాయి పాత్ర కాదు కాని ఉన్నంతలో చెడగొట్టకుండా మంచి టెంపో క్యారీ చేసాడు. కామెడీ కోసం ఇరికించిన హైపర్ ఆది అంతగా ఉపయోగపడింది లేదు కాని అలాగని డ్యామేజ్ కూడా చేయలేదు. కాస్త మోటుగా ఉన్నా నవ్వులు పూయించాడు.తమకు అలవాటైన పాత్రలో ఎన్ఆర్ఐగా సీనియర్ నరేష్, వరుణ్ తల్లిగా సుహాసిని అలా చేసుకుంటూ పోయారు. విద్యుల్లేఖ రామన్ హాస్యానికి పనికి వచ్చింది. ప్రియదర్శి లవర్ గా పటాస్ ఫేం ప్రచీ తకర్ కు స్పాన్ బాగానే దొరికింది. 

సాంకేతిక వర్గం 

దర్శకుడు వెంకీ చాలా క్లియర్ గా యూత్ ని టార్గెట్ చేసుకుని ఈ సినిమా తీసాడు. రచయితగానూ గతంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కి వర్క్ చేసిన ఇతనిలో మంచి భావుకుడు ఉన్నాడు. అది ప్రతి ఫ్రేంలో స్పష్టంగా కనిపిస్తుంది. గొప్పగా అనిపించడానికి అవకాశం లేని ఒక మామూలు ప్రేమ కథను తన టేకింగ్ తో ఎమోషనల్ జర్నీ చేయించి మెప్పించేలా చేయటంలో దాదాపు సక్సెస్ అయ్యాడు. తొలి ప్రేమ అనగానే మెగా ఫాన్స్ వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ సినిమా. దానికి దీనికి ఎంత మాత్రం సంబంధం లేదు. చాలా డిఫరెంట్ గా ట్రై చేసాడు వెంకీ.

కామెడీని ఎంటర్టైన్మెంట్ కథలో భాగంగా ఇవ్వడానికి ప్రయత్నించాడు తప్ప అదే పనిగా చూపించకపోవడం ప్లస్ అయ్యింది. సాధారణంగా ఇలాంటి ప్రేమ కథలు స్లో నెరేషన్ తో ఉంటాయి. ఈ తొలి ప్రేమ కూడా అదే ఫార్మాట్ లో వెళ్ళింది. కాకపోతే ఫీల్ గుడ్ నెస్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడటంతో ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సాగుతూ వెళ్ళింది. సింపుల్ గా కాకుండా బ్రేక్ అప్ అయిన లవ్ స్టొరీని ఆరేళ్ళ తర్వాత తిరిగి కలపడం అనే పాయింట్ ఈ మధ్య వచ్చిన సుమంత్ మళ్ళి రావాకు దగ్గరగా ఉన్నప్పటికీ అది ఎక్కువ శాతం ప్రేక్షకులకు రీచ్ కాలేదు కాబట్టి దీనికి ప్లస్ గా మారనుంది. త్వరగా ఆవేశపడే కుర్రాడిగా వరుణ్ పాత్రను డిజైన్ చేసిన తీరు గతంలో ఎన్నో సినిమాల్లో చూసినదే అయినా ఆ జంట చుట్టూ అల్లుకున్న కథనం దీన్ని ఎంగేజ్ అవుతూ చూసేలా చేసింది. 

కాని ఫస్ట్ హాఫ్ లో మంచి టెంపో మైంటైన్ చేసిన వెంకీ అట్లూరి సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిగా తగ్గడం ప్రభావం చూపించింది. హత్తుకునే సన్నివేశాలు ఉన్నప్పటికీ బలమైన ఎమోషన్ ని రిజిస్టర్ చేయటంలో కొంత తడబడటంతో గ్రాఫ్ డౌన్ అయ్యింది. ఆదిత్యకు ఉన్న ఈగో, కోపం అతిగా అనిపించడం వల్ల వర్ష మీద సానుభూతి పెరుగుతుంది. హీరో పాత్ర అంత ఆరోగెంట్ గా మలచిన దర్శకుడు అలా ఉండటం వల్ల తప్పేమీ లేదని ప్రేక్షకులతో అనిపించలేకపోయాడు. ఈ కారణంగానే వర్ష మీద ఉన్న ప్రేమ ఆదిత్య మీద కలగదు. లండన్ లో ఆదిత్య, వర్ష తిరిగి కలిసాక జరగబోయేది ఈజీగా గెస్ చేయగలం కాబట్టి అంత ఎగ్జైటింగ్ గా అనిపించదు. లండన్ షిఫ్ట్ అయ్యాక స్లో కావడమే కొంచెం ఇబ్బంది కలిగించే మైనస్ పాయింట్.

తమన్ ఈ మధ్యకాలంలో మంచి ఔట్ పుట్ ఇచ్చిన మూవీ ఇదొక్కటే. మూడు పాటలు మెప్పించేలా ట్యూన్ చేసిన తమన్ మంచి ఫీల్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. జార్జ్ సి విలియమ్స్ కెమెరా ఈ సినిమాకు మెయిన్ అసెట్. విజువల్స్ ని అద్భుతంగా తెరముందుకు తీసుకొచ్చారు. నవీన్ నూలి ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. లండన్ ఎపిసోడ్ ఎక్కువగా మూవ్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది. వరుణ్ విడిపోవడానికి పదే పదే చెప్పే కారణం కన్విన్సింగ్ గా అనిపించదు. అది వదిలేస్తే మిగిలినదంతా ఒకే. భోగవల్లి ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడలేదు. 

ప్లస్ పాయింట్స్ 

వరుణ్, రాశి పెర్ఫార్మెన్స్ 

విలియమ్స్ కెమెరా 

ఫ్రెష్ గా అనిపించే కథనం 

తమన్ మ్యూజిక్ 

ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ 

మైనస్ పాయింట్స్

వరుణ్ పాత్రని డిజైన్ చేసిన తీరు 

లండన్ ఎపిసోడ్ స్లో కావడం

లెంగ్త్

కథ పాతదే 

చివరి మాట 

తొలిప్రేమ ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ కలిగించే సింపుల్ లవ్ స్టొరీ.  యనీక్ అనిపించే కొత్తదనం ఇందులో లేదు.కాని ప్రేమ కథలను ఇష్టపడేవాళ్ళను, నిజంగా ప్రేమించిన వాళ్లకు మాత్రం వెంటనే కనెక్ట్ అయిపోయే సినిమా ఇది. అర్థం లేని తింగరి కథలతో ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్న రొటీన్ సినిమాల కన్నా ఇది చాలా రెట్లు నయం. 

తొలిప్రేమ- తడబడినా బాగా ప్రేమించారు

రేటింగ్: 3/5

 

In English :

Varun Tej's TholiPrema Movie Review!!​​​​​​​

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE