దేశంలో దొంగలు పడ్డారు రివ్యూ

Updated By VankayaThu, 10/04/2018 - 16:54
Desamlo Dongalu Paddaru Movie Review

రేపు విజయ్ దేవరకొండ నోటా ఉన్నా భయపడకుండా విడుదలైన చిన్న సినిమా దేశంలో దొంగలు పడ్డారు. ఖయ్యుమ్ హీరోగా అతని అన్న ఆలీ స్వయంగా ఓ నిర్మాణ భాగస్వామిగా మారి తీసిన ఈ మూవీ ట్రైలర్ ని  చిరంజీవితో పర్సనల్ గా విడుదల చేయించడంతో ఏదో టైం పాస్ ఆశించే సగటు ప్రేక్షకులు ఓసారి ట్రై చేద్దామని అనుకున్నవాళ్ళు లేకపోలేదు. మరి ఇది కనీస అంచనాలు అయినా అందుకుందో లేదో సింపుల్ రివ్యూలో చూద్దాం

శక్తి(ఖయ్యుమ్), బిజ్జు(షాని)తోడు దొంగలు. శక్తి మంచోడే అయినా స్నేహితుడి కోసం వీటికి పాల్పడుతూ ఉంటాడు. ఓ పెద్ద సెటిల్మెంట్ కోసం సీత(తనిష్క్ రాజన్)ను కిడ్నాప్ చేస్తాడు బిజ్జు. తనను విడిపించడం కోసం విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటాడు పృథ్విరాజ్.  కొన్ని సంఘటనల తర్వాత శక్తి, బిజ్జు అపార్థాలతో విడిపోతారు. బిజ్జు, పృథ్విరాజ్ లు కలిసి శక్తి, సీతల వెంట పడతారు. అప్పుడే శక్తికి సీత వెనుక ఉన్న ఒక ట్రాజెడీ గురించి తెలుస్తుంది. దాంతో తన లక్ష్యాన్ని మార్చుకుంటాడు. చివరికి ఏమైంది అనేదే బాలన్స్ కథ 

నటన పరంగా ఆర్టిస్టులు తమ వంతు ప్రయత్నం చేసారు. ఖయ్యుమ్ లో టాలెంట్ ఉన్నప్పటికీ ఇంత ఏజ్ బార్ టైం లో హీరోగా ఎందుకు చేయాలనిపించిందో అర్థం కాదు. షాని బాగా చేసాడు. హీరోయిన్ తనిష్క్ రాజన్ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఓ మెసేజ్ మిక్స్ చేయాలనుకున్న క్రైమ్ థ్రిల్లర్ గా సినిమాలో  అందరిని వాడుకున్నారు కానీ కథనం మాత్రం గాలికి వదిలేసారు. 

సినిమా ఎక్కడా ఆసక్తిగా అనిపించదు. టేకాఫ్ కాస్త పర్వాలేదు అనిపించినా ముందుకు వెళ్లే కొద్దీ తన అనుభవ రాహిత్యంతో దర్శకుడు గౌతమ్ రాజ్ కుమార్ ఎక్కడా మెచ్చుకునే అవకాశాన్ని ఇవ్వడు. లాజిక్స్ లేకుండా తోచిన విధంగా స్క్రీన్ ప్లే రాసుకుని అర్థం లేని సీన్లతో చప్పగా తీసుకుంటూ పోయారు. ఎవరికి ఇమేజ్ లేదనే విషయాన్నీ గుర్తుంచుకుని బలమైన సన్నివేశాలు అల్లుకుని ఉంటే ఇది ఇంకో లెవెల్ లో ఉండేది. కానీ దర్శకుడికు ఆ ఊసే లేదు. శాండీ మ్యూజిక్ జస్ట్ ఓకే. శేఖర్ కెమెరా మాములుగా ఉంది. 

పేపర్ మీద పర్వాలేదు అనిపించే కథను సరైన రీతిలో రాసుకోకపోతే ఎంత దారుణమైన అవుట్ ఫుట్ వస్తుందో చూపించడానికి తప్ప దేశం లో దొంగలు పడ్డారు దేనికీ ఉపయోగపడలేదు. చిన్న ఆర్టిస్టులు ఉన్నా కంటెంట్ విషయంలో శ్రద్ధ వహిస్తే కనీసం ఓ వర్గాన్నైనా మెప్పించే అవకాశం ఉండేది. కానీ దాన్ని చేతులారా పాడు చేసుకున్న దేశంలో దొంగలు పడ్డారు ఏ కోణంలోనూ పాస్ కాలేక మరో చేదు ఫలితాన్ని అందుకుంది 

దేశంలో దొంగలు పడ్డారు - పరీక్షలో ఫెయిలయ్యారు 

రేటింగ్ : 1.5 /5 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE