నోటా రివ్యూ

Updated By VankayaFri, 10/05/2018 - 13:40
NOTA Review

టాలీవుడ్ లో పట్టుమని పది సినిమాలు దాటకుండానే స్టార్ హీరో రేంజ్ లో ఓపెనింగ్స్ తెచ్చుకునే స్థాయిలో ఎదిగిన హీరోగా విజయ్ దేవరకొండ అరుదైన క్యాటగిరీలోకి వస్తాడు. అర్జున్ రెడ్డికి గీత గోవిందంకి ఏ మాత్రం పోలిక లేని రెండు వైరుధ్యమైన పాత్రలను అవలీలగా మెప్పించిన తీరు యూత్ లో ఎవరికి లేని ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. అందుకే నోటా మీద ముందు నుంచి ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.

పొలిటికల్ జానర్ లో వచ్చిన మూవీ కావడంతో వర్తమాన  రాజకీయాలకు సంబంధించి ఏవైనా వివాదాస్పద అంశాలు ఉంటాయన్న ఊహాగానాలు కూడా ముందు ఉంచే ఉన్నాయి. భారీ ఓపెనింగ్స్ మధ్యా నోటా విజయ్ కెరీర్ లోనే పెద్ద రిలీజ్ తో ముందు వచ్చింది. మరి ఇన్నేసి అంచనాలు మోసుకుంటూ వచ్చినా నోటా వాటిని అందుకుండా లేదా టైటిల్ కు తగ్గట్టు చెల్లని ఓటులా మిగిలిపోయిందా రివ్యూ లో చూద్దాం పదండి 

కథ 

ముఖ్యమంత్రి వాసుదేవ్(నాజర్)ఒకే ఒక్క వారసుడు వరుణ్(విజయ్ దేవరకొండ). లండన్ లో గేమ్ డిజైనర్ గా లైఫ్ ని సరదాగా గడిపేస్తున్న వరుణ్ కు నాన్న ఓకే కేసు నిమిత్తం కొంతకాలం జైలుకు వెళ్లాల్సి ఉండటంతో ఇండియా రాగానే సడన్ గా సిఎం పీఠం మీద కూర్చోవాల్సి వస్తుంది. దాని వెనుక ఒక స్వామిజి హస్తం ఉంటుంది. అయినా కూడా తన లైఫ్ స్టైల్ ని మార్చుకోకుండా ఎప్పటి లాగే ఉంటాడు.

వరుణ్ కు సలహాదారుడిగా ఉంటూ అతన్ని నడిపిస్తూ ఉంటాడు జర్నలిస్ట్ మహేంద్ర(సత్య రాజ్). అతని కూతురే స్వాతి(మెహ్రీన్). వరుణ్ మొదట సీఎం పదవిని తేలిగ్గా తీసుకున్నా ఆ తర్వాత పెనుసవాళ్లు ఎదురవుతాయి. ఒక ఆ ఆక్సిడెంట్ తో వాసుదేవ్ కోమాలోకి వెళ్లిపోవడంతో వరుణ్ ఫుల్ టైం సిఎంగా మారాల్సి వస్తుంది. మరి కఠినమైన పరిస్థితులను తట్టుకుని వరుణ్ సిఎంగా ఏం చేశాడు అనేదే నోటా 


నటీనటులు 

విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ లో అందరిలో ఉండని ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. యాటిట్యూడ్ ని శరీరంతో పాటు మొహంలో కూడా చూపిస్తాడు. అర్జున్ రెడ్డిలో ఇది పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసాడు కాబట్టే అంత గొప్ప పేరు వచ్చింది. కాకపోతే మైనపు ముద్దలాంటి విజయ్ దేవరకొండ దర్శకుడు అలా మలచుకుంటే అలా మారిపోతాడు. కానీ ఇప్పటి దాకా ఇతన్ని సరిగ్గా వాడుకున్న దర్శకులే దొరికారు కాబట్టి అన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. నోటాకు ఆ ఛాన్స్ లేదు. విజయ్ దేవరకొండ తనవరకు పూర్తి న్యాయం చేసాడు. సరదాలకు అలవాటు పడిన ఒక సీఎం కొడుకు అనుకోకుండా పెద్ద బాధ్యతలు మోయాల్సి వస్తే అది ఊహించని సవాళ్ళను తన ముందు పెడితే ఎదురుకునే యువకుడిగా తన బెస్ట్ ఇచ్చాడు. 

అయితే చుట్టూ ఉన్న అంశాలు బలహీనంగా ఉండటంతో చాలా చోట్ల నిస్సహాయంగా మారిపోయాడు. పాత్రలో ఉన్న ఇంటెన్సిటిని తన శాయశక్తులా చూపించిన విజయ్ ఇందులో మాత్రం దర్శకుడి వల్ల ఫెయిల్ అయ్యాడు. నటన పరంగా మాత్రం విజయ్ దేవరకొండ ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉంది. ఎప్పటికప్పుడు తనలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాను అనే భ్రమలో ఉండిపోతే ఇదే మొనాటనీగా మారే ప్రమాదం ఉంది. 

హీరోయిన్ మెహ్రీన్ పూర్తిగా వృధా అయిపోయింది. తనకంటూ ప్రత్యేకంగా లవ్ ట్రాక్ అంటూ ఏదీ లేకపోవడంతో సాధారణ ప్రేక్షకులు తనతో ఏ దశలోనూ కనెక్ట్ కారు. పైగా కథలో ప్రాధాన్యం లేకపోవడంతో జర్నలిస్ట్ పాత్ర వేసినా పూర్తిగా తేలిపోయింది.  గ్లామర్ గురించి మాట్లాడుకొకపోవడం ఉత్తమం. తన కెరీర్ లో ఇంత డల్ గా ఉన్న పాత్ర చేసే అవకాశం తనకే మళ్ళి రాకపోవచ్చు. సత్య రాజ్ , నాజర్ తమ అనుభవాన్ని యధావిధిగా చూపించేసారు.

ఇలాంటివి ఎన్నో గతంలోనే చేసారు కాబట్టి అంత కొత్తదనం అయితే కనిపించదు. సత్యరాజ్ అక్కడక్కడా  కాస్త అత్యుత్సాహంతో కొంత ఓవర్ చేసినట్టుగా అనిపిస్తుంది. యష్వికా ఆనంద్ సీఎంను టార్గెట్ చేసిన ప్రత్యర్థి పాత్రలో బాగానే చేసింది. ప్రియదర్శిని తెలుగు వెర్షన్ కోసం పెట్టుకున్నట్టు ఉంది తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. ఎంఎస్ భాస్కర్, సంచనా నటరాజన్ అందరు తమిళ బ్యాచ్ కావడంతో నేటివిటీ ఫ్లేవర్ పూర్తిగా మిస్ అయిపోయింది 

సాంకేతిక వర్గం 

దర్శకుడు ఆనంద్ శంకర్ మంచి లైన్ రాసుకున్నాడు. కానీ కథనం విషయంలో నిర్లక్యం వహించడం పూర్తిగా దెబ్బ కొట్టింది. పొలిటికల్ థ్రిల్లర్స్ కత్తి మీద సాము లాంటివి. అందుకే స్టార్ హీరోలు సైతం వాటి జోలికి వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు. కానీ సరైన హోమ్ వర్క్ చేయకుండా తమిళనాడులో వర్తమాన రాజకీయాల్లో ఈ మధ్య జరిగిన కొన్ని సంచలనాత్మక సంఘటనలతో కథను అల్లుకుంటే జనం ఎగబడి చూస్తారు అనే తప్పుడు లెక్కలో పూర్తిగా తప్పటడుగు వేసాడు. హీరో సీఎం కావడం ఇటీవలే భరత్ అనే నేనులో చూసాం. ఎంత మెసేజ్ ఇచ్చినా కమర్షియల్ అంశాల విషయంలో కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు కాబట్టే అది సూపర్ హిట్ అయ్యింది. కానీ హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోవాలన్న ప్రాధమిక సూత్రాన్ని మరిచిన ఆనంద్ శంకర్ తన చిత్తానికి రాసుకుంటూ పోయాడు.

ఇలాంటి కథల్లో టెంపో మైంటైన్ చేయాలి  అంటే ఊహకందని మలుపులు ఉండాలి. అవి పేపర్ మీద ఓ మోస్తరుగా  రాసుకున్న ఆనంద్ శంకర్  వాటికి తెరకెక్కించడంలో గతి తప్పాడు. దీంతో ఎక్కడా ఆసక్తి రేపని స్క్రీన్ ప్లే ఎలాంటి డ్రామా లేకుండానే సాగిపోతుంది. దీంతో రెండున్నర గంటల ప్రహసనం ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్న ఫీలింగ్ సెకండ్ హాఫ్ అయ్యాక పీక్స్ కు చేరుకుంటుంది. 

పైగా దాదాపు అందరు ఆరవ మొహాలే కావడంతో విజయ్ దేవరకొండను చూస్తే తప్ప ఇది తెలుగు సినిమా అని గుర్తుకు రాదు. ఇంతోటి దానికి ద్విభాషా చిత్రంగా చెప్పుకున్నారు కానీ ఇది ఫక్తు డబ్బింగ్ సినిమా. హీరోతో సహా అన్ని తమిళ్ లో మాట్లాడాయి. ఇలాంటి కథలను ఎంగేజ్ చేయడానికి అవసరమైన ట్విస్టులు రాసుకోకుండా హడావిడి పడిన ఆనంద్ శంకర్ దానికి తగిన మూల్యాన్ని చెల్లించాడు. ఫ్లాట్ గా చెప్పుకుంటూ పోవడం పెద్ద మైనస్ గా నిలిచింది. కనీసం మాస్ ని మెప్పించేలా పాటలు, అవసరమైన యాక్షన్ డ్రామా చొప్పించి ఉంటే బాగుండేది. హీరో పాత్ర సీఎంగా ఉన్న వాటిలో ఇప్పటికీ ఒకే ఒక్కడు ఎందుకు ల్యాండ్ మార్క్ గా నిలిచిందో నోటా చూస్తే మరోసారి అర్థమవుతుంది.

సంగీత దర్శకుడు సామ్ సిఎస్ కు రెమ్యునరేషన్ ఇచ్చారో లేదో తెలియదు కానీ రణగొణ ధ్వనిలా అనిపించే పాటలతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చిరాకు తెప్పించాడు. ఎంత పొలిటికల్ జానర్ మూవీ అయినా పాటలు క్యాచీగా ఉండకూడదు అన్న రూల్ ఏమి లేదు. విక్రమ్ వేదా లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ కి స్కోర్ ఇచ్చిన సామ్ సిఎస్ నుంచి ఇంత నాసిరకం అవుట్ రావడంలో తప్పు దర్శకుడిదా లేకా స్వయంకృతాపరాధమో వాళ్ళకే తెలియాలి. శంతన కృష్ణన్ రవిచంద్రన్ కెమెరా ఉన్నంతలో చాలా నయం.

చాలా చోట్ల ప్రొడక్షన్ క్వాలిటీలో తేడా కొట్టినా వాటిని రక్షించే ప్రయత్నం చేసాడు. రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్ ఏ మాత్రం మెచ్చదగిన స్థాయిలో లేదు. కత్తెర పడాల్సిన సన్నివేశాలను కూడా అలాగే ఉంచేసాడు. ఇది అనవసరంగా ఉందే అని ప్రేక్షకుడికి ఫీలింగ్ కలిగిందంటే అది ముమ్మాటికీ ఎడిటర్ లోపమే. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు ఏమంత ఘనంగా లేవు. చాలా చోట్ల రాజీ పడ్డారు. గీత గోవిందం ముందు ఒప్పుకున్న సినిమా కాబట్టి బడ్జెట్ లో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఆచి తూచి ఖర్చు పెట్టినట్టు ఉన్నారు. ఆ లోపం మేకింగ్ లో స్పష్టంగా కనిపించింది 

పాజిటివ్ పాయింట్స్ 

విజయ్ దేవరకొండ 
మెయిన్ థీమ్ 
వరుణ్ వీడియో ఎపిసోడ్ 
బస్ ఫైర్ ఎమోషన్ 

నెగటివ్ పాయింట్స్ 

కథనం 
మెహ్రీన్ పాత్ర 
సంగీతం 
అప్ అండ్ డౌన్ గ్రాఫ్ 
ఫ్లాట్ స్క్రీన్ ప్లే

చివరి మాట 

నోటా అటు రాజకీయ చిత్రంగా కాక ఇటు కమర్షియల్ యాంగిల్ లోనూ మెప్పించలేక రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయింది. విజయ్ దేవరకొండ ఇమేజ్ ఎంత ఉన్నా అతని మీద అభిమానం థియేటర్ దాకా తీసుకెళ్లినా మిగిలిన అంశాలు మరీ తీసికట్టుగా ఉండటంతో నోటా ఏ దశలో పర్వాలేదు అనే సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగించదు. రాజకీయ నేపధ్యం కాబట్టి చాలా మలుపులు ఉంటాయని ఏదేదో ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. విజయ్ దేవరకొండ అయినా సరే తనకు నప్పని ఒప్పని కథలో ఇరికించే ప్రయత్నం చేస్తే భంగపాటు తప్పదని రుజువు చేసేందుకే నోటా ఉపయోగపడింది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు ఓసారి 
నచ్చే అవకాశం లేకపోలేదు.

నోటా - ఓటు పూర్తిగా చెల్లలేదు 

రేటింగ్ : 2/5

In English :

NOTA Movie Review

 

 

 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE