ఎఎన్నార్ రీమేక్ చెడగొట్టారు

Updated By VankayaFri, 10/12/2018 - 14:58
Helicopter Eela

నిన్నంతా అరవింద సమేత వీర రాఘవ హడావిడిలో పడిపోయాం కానీ ఇవాళ హిందీలో రెండు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలయ్యాయి. అందులో కాజల్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన హెలికాఫ్టర్ ఈలా మీద అందరి దృష్టి ఉంది. మరి ఇది ఎంతవరకు మెప్పించిందో సింపుల్ గా చూసేద్దాం.

ఈలా రైతుర్కర్(కాజోల్ దేవగన్)22 ఏళ్ళ తర్వాత వదిలేసిన చదువు పూర్తి చేయడం కోసం కొడుకు వివాన్(రిద్ది సేన్) కాలేజీలోనే చేరుతుంది. తల్లీకొడుకులు ఒకే చోట చదువుకోవడానికి రావడం చూసి అందరు షాక్ తింటారు. ఈలా భర్త అరుణ్(తోతా రాయ్ చౌదరి)పెళ్ళైన కొంత కాలానికే వీళ్ళను వదిలేసి వెళ్ళుంటాడు. అసలు ఈలా ఇంత గ్యాప్ తర్వాత ఎందుకు కాలేజీకి వెళ్తుంది అసలు దీని వెనుక కథేంటి అనేది తెరమీద చూసి తరించాల్సిందే. 

నిజానికి అచ్చం ఇలాంటి కథతో 1992లో అక్కినేని ప్రధాన పాత్రలో కాలేజీ బుల్లోడు అనే సినిమా వచ్చింది. హరీష్, యమున ఇద్దరు పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకుని ఎఎన్నార్ వ్యాపార ప్రత్యర్థి ఎగతాళి చేసాడనే కోపంతో కొడుకు ఉండే కాలేజీలోనే అడ్మిషన్ తీసుకుంటాడు. అక్కడి నుంచి కథ రకరకాల మలుపులతో సరదాగా సాగిపోతుంది. శరత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో మంచి హిట్ అయ్యింది. రాజ్ కోటి ట్యూన్స్ కి చాలా పేరు వచ్చింది. అదే లైన్ తీసుకుని కొన్ని మార్పులు చేసి ఎఎన్నార్ బదులు కాజోల్ ని రీప్లేస్ చేసి హెలికాఫ్టర్ ఈలా తీసారు. 

ప్రదీప్ సర్కార్ దర్శకత్వం తీసికట్టుగా ఉంది. తీసుకున్న పాయింట్ మంచిదే అయినా దాన్ని ఎంటర్ టైనింగ్ గా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇది కాస్త సహన పరీక్షగా మారింది. కాజోల్, రిద్ది మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ డ్రామా టీచర్ గా నటించిన నేహా ధూపియాతో సహా అందరు ఓవర్ యాక్షన్ చేయడంతో చివరిదాకా భరించడం కష్టమే అనిపిస్తుంది. పాటలు సోసోగా ఉండటం వెరసి  హెలికాఫ్టర్ గాల్లోనే కూలిపోయిన ఫీలింగ్ కలిగిస్తుంది. 
 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE