రోటీనే గురు - ట్రైలర్ రివ్యూ

Updated By VankayaWed, 10/10/2018 - 13:44
Hello Guru Prema Kosame Trailer

రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందిన హలో గురు ప్రేమ కోసమే ట్రైలర్ ఇందాకా విడుదల చేసారు. వచ్చే వారమే రిలీజ్ కాబట్టి ఆడియోతో పాటు అన్ని హడావిడిగా బయటికి వచ్చేస్తున్నాయి. ట్రైలర్ విషయానికి వస్తే కథ పరంగా మరీ కొత్తదనం అయితే కనిపించడం లేదు. మధ్య తరగతికి చెందిన సంజూ(రామ్)కు కొత్తగా చేరిన కంపెనీలో అను మొదటిచూపులోనే నచ్చేస్తుంది.

పరిచయం ప్రేమగా మారుతుంది. వయసులో తన కన్నా చాలా పెద్దవాడైన ప్రకాష్ రాజ్ తో రామ్ కు మంచి స్నేహం ఉంటుంది. కానీ అనుపమనే ప్రకాష్ రాజ్ కూతురే అని తెలియక రామ్ , రామ్ చెబుతున్న ప్రేమకథలో హీరోయిన్ తన కూతురే అని తెలియక ప్రకాష్ రాజ్ పరస్పరం సరదాగా నడిపించినట్టు ఉంది. చిన్న ఎమోషనల్ టచ్ తో కట్ చేసిన ట్రైలర్ లో బెజావాడ ప్రసన్న కుమార్ డైలాగ్స్ తప్ప చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు ఏమి లేవు. 

స్టోరీ లైన్ సింపుల్ గా కనిపిస్తోంది. ఇలా హీరోయిన్ తండ్రి అని తెలియకుండా హీరో అతనితోనే ఫ్రెండ్ షిప్ చేయడం అనే కాన్సెప్ట్ గతంలోనే సత్యంలో చూసాం. అందులో తండ్రి కూతుళ్లుగా కోట, జెనీలియాలు కనిపిస్తారు. బడ్జెట్ కూడా హెవీగా డిమాండ్ చేసినది కాకపోవడంతో సింపుల్ గా లాగించేసారు. పోసాని, సితార, జయప్రకాశ్ అందరూ అలవాటైన పాత్రల్లోనే కనిపిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ నేను లోకల్ కు ఎక్స్ టెన్షన్ లా ఉంది తప్ప ఇంకే ప్రత్యేకత లేదు. మొత్తానికి దిల్ రాజు హలొ గురు ప్రేమ కోసమేతో చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. విశాల్ పందెం కోడి 2తో అక్టోబర్ 18న ఈ సినిమా పోటీ పడనుంది. రామ్-అనుపమ జోడికి ఇది హిట్ కావడం చాలా అవసరం. ఇద్దరూ బ్యాడ్ టైంలోనే ఉన్నారు. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE