గురూజీ ఇదేనా మీ మార్కు

Updated By VankayaFri, 10/12/2018 - 10:02
trivikram

నిన్న విడుదలైన అరవింద సమేత వీర రాఘవ సక్సెస్ ఏ రేంజ్ అనేది పక్కన పెడితే నిజంగా త్రివిక్రమ్ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నట్టేనా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా దొరకలేదు. దానికి కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నితిన్ తో అఆ తీసినప్పుడు విజయనిర్మల గారి మీనా సినిమాను కాపీ కొట్టినా దాన్ని బయటికి చెప్పుకోకుండా వివాదం అయ్యాక రచయిత్రి యద్దనపూడి సులోచనారాణికి సారీ చెప్పినప్పుడే ఆయన మీద మరకలు పడటం మొదలైంది. ఎప్పుడైతే అజ్ఞాతవాసిని ఫ్రెంచ్ సినిమా లార్గో వించ్ నుంచి తీసుకుని ఏమి తెలియనట్టు నటించి తిరిగి అదే సోషల్ మీడియాలో ఇది బయటపడినప్పుడు మౌనం వహించారు తప్ప అవును తీసుకున్నాను అని చెప్పలేదు.

ఇక తారక్ సినిమా విషయానికి వస్తే సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్లు ఎపిసోడ్లు తనదైన శైలిలో నడిపించిన మాట నిజమే కానీ కథ గురించి మాత్రం ఇప్పుడు కామెంట్స్ జోరుగానే వినిపిస్తున్నాయి. రెండు వర్గాల మధ్య సీమ పోరుని మొదటిసారిగా టచ్ చేసింది తమ్మారెడ్డి భరద్వాజ. 1992లో శారదా ప్రధాన పాత్రలో సీనియర్ నటీనటులంతా కనిపించే కడప రెడ్డెమ్మలో వర్గ పోరుని బాగా ఎక్స్ పోజ్ చేసారు. బాగానే ఆడింది కూడా. ఆ తర్వాత ప్రేమించుకుందాం రాతో దీనికి పునాది పడితే బి గోపాల్ సమరసింహారెడ్డితో సీమ ఫ్యాక్షన్ ని  కలెక్షన్ల కల్పవృక్షంలా మార్చేశారు . 

అది మొదలుకుని ఆది, సాంబ, ఇంద్ర, చెన్నకేశవరెడ్డి. భద్ర, దమ్ము ఇలా ఎన్ని వచ్చాయో లెక్కబెట్టుకోవడం కష్టమే. అన్ని స్టార్ హీరోలు చేసినవే. ఇప్పుడు త్రివిక్రమ్ చెబుతున్న యుద్ధం తర్వాత పరిస్థితి గురించి భద్రలో ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు పాత్రల ద్వారా బోయపాటి ఇంతకు ముందే డిస్కస్ చేసాడు కూడా. కాకపోతే అరవింద సమేతలో ఉన్నంత డెప్త్ అందులో లేదు. అదొక్కటే తేడా తప్పించి అసలు ఎవరూ చూపించనే లేదు అనేది మాత్రం అబద్దమే. ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ లో చెబుదామని ట్రై చేసిన ఎన్టీఆర్-పూజ హెగ్డేల లవ్ ట్రాక్ కూడా ఏమంత సింక్ కాలేదు కాబట్టే ఫస్ట్ హాఫ్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి.

ఇక్కడ ఈ ప్రస్తావన తీసుకురావడానికి కారణం అరవింద సమేతలో మరీ కొత్తగా ట్రై చేసింది ఏమి లేదు అని చెప్పేందుకే. తారక్ యాక్టింగ్ అండగా లేకపోయి ఉంటే ఇది మరో డిజాస్టర్ అయ్యే అవకాశం ఉండేది. అందులో డౌట్ లేదు. కీలకమైన మరో విషయం ఎప్పుడో దశాబ్దాల నాడే సమిసిపోయిన రాయలసీమ ఫ్యాక్షన్ భూతం ఇంకా జడలు విరబోసుకుని ఉందనేలా చూపడం మాత్రం సరికాదు. రంగస్థలం తరహాలో ఇదో పాతికేళ్ల వెనుక కథగా చెప్పుకున్నా సరిపోయేది. కానీ వర్తమానం అనే చూపించారు. మరి ఇంత అరిగిపోయి అందరు వాడిసి మానేసిన ఫార్ములాని గొప్పగా తీశానని చెప్పుకోవడమేనా గురూజీ మార్క్. సమాధానం ఆయనకే తెలుసు. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE