విజయ్ దేవరకొండతో 3 బ్యూటీలు

Updated By VankayaFri, 10/12/2018 - 15:59
vijay Devarakonda

నోటా ఇచ్చిన షాక్ కు త్వరగానే కోలుకున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ దాన్నుంచి గట్టి పాఠాలే నేర్చుకున్నాడు. సినిమా నడడానికి తన ఇమేజ్, ఫాలోయింగ్ ఒకటే సరిపోదని గుర్తించాడు. మొదటి వారం తిరక్కుండానే నోటా పరాజయాన్ని సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ గా ఒప్పేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ దీని తర్వాత సినిమా కోసం రంగం సిద్ధమవుతోంది.

ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించే మూవీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఓనమాలు, మళ్ళి మళ్ళి రాని రోజు లాంటి విభిన్నమైన సినిమాల ద్వారా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దీనికి దర్శకుడు. ఈయన గత ఏడాది చేసిన ఉంగరాల రాంబాబు దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. విజయ్ తో ఇంతకు ముందే చేసుకున్న కమిట్మెంట్ కాబట్టి ఇది పట్టాలెక్కుతోందని సమాచారం. ప్రేమ జానర్ లోనే ఇది రూపొందనున్నట్టు తెలిసింది. 

మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే ఇందులో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. ఇప్పటి దాకా విజయ్ దేవరకొండ చేసినవన్నీ సింగల్ హీరోయిన్ సినిమాలే. పెళ్లి చూపులు, ద్వారక, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, నోటా ఏది తీసుకున్నా అందులో రెండో హీరోయిన్ ఉండదు. కానీ ఇందులో మాత్రం రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ తో పాటు బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె కూడా నటించబోతోంది. గీత గోవిందంలో ఇంకేం కావాలె అంటూ మారుమ్రోగించిన గోపి సుందర్ దీనికి సంగీత దర్శకుడు.

వచ్చే ఏడాది సమ్మర్ లో ప్లాన్ చేసిన ఈ మూవీలో భావోద్వేగాలకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. సో మొదటిసారి తన శైలికి భిన్నంగా కొత్త ప్రయోగాలు చేస్తున్న విజయ్ దేవరకొండ మరో సినిమా టాక్సీ వాలా వచ్చే సూచనలు ఎంతకీ కనిపించడం లేదు. ఇంతకీ రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా అనే అభిమానుల ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. వచ్చే నెల లేదా డిసెంబర్ లో ఉండొచ్చు అంటున్నారు కానీ విజయ్ కు మాత్రం దాని మీద పెద్ద ఆసక్తి లేదని వినికిడి. 

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE