కాంగ్రెస్ కు భారీ షాక్.. జనసేనలోకి నాదెండ్ల

Updated By VankayaThu, 10/11/2018 - 14:26
Nadendla Quits Cong, To Join Jana Sena!

తెనాలి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ షాకిచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న ఆయన జనసేనలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పడిప్పుడే పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు ఇది కోలుకోలేని దెబ్బే.

రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ దాదాపు అన్ని స్థానాల్లో ఓడిపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. మరలా ఇప్పుడిప్పుడే పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో నాదెండ్ల మనోహర్ ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. గత ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.

ఈయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా చేశారు. ఎన్టీఆర్ తో విభేదిస్తూ చాలా రాజకీయమే నడిపారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు మనోహర్. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ముందు డిప్యూటీ స్పీకర్ గా చేశారు. ఆ తరువాత స్పీకర్ గా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల తరువాత స్తబ్దుగా ఉండిపోయారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తూ వచ్చారు.

ఏపీలో ఎన్నికలు 9 నెలలు ఉండగానే మాజీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేలోకి చేరుతున్నట్లు నిర్ణయించుకున్నారు. జూలైలో పవన్ కల్యాణ్ తో ఓ సారి భేటి అయ్యారు. రాష్ట్ర రాజకీయాల గురించి చాలాసేపు చర్చించుకున్నారు.  అలాగే ఆ మధ్య మనోహర్ వైసీపీలోకి వెళ్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఏ విషయంపై ఆయన ఎక్కడా స్పందించలేదు.

ప్రస్తుతం జనసేనలోకి వెళ్తున్నట్లు ప్రకటించి తిరుపతికి పయనమయ్యారు. పవన్ కల్యాణ్ కూడా ఈ సాయంత్రం తిరుపతికి వస్తారు. ఆయన సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆయన చేరికతో జనసేనకు కొత్త ఉత్సాహం వచ్చినట్లయ్యింది. కాంగ్రెస్ డీలా పడిపోయింది. అయితే, మనోహర్ ఎంత మేరకు ఓటర్లను ప్రభావిం చేస్తారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE