కేసీఆర్‌.. పాటే మంత్రమూ !

Updated By VankayaTue, 10/09/2018 - 20:58
kcr

పాట.... తెలంగాణకు జీవనాడి. పాటకి పల్లే, పట్నం ప్రజలు పరవశిస్తారు. ప్రజల గుండెలలో పాటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఉద్యమానికి పాట ప్రాణం పోసింది. ఉద్యమ సమయంలో వందలాది పాటలు తెలంగాణ ప్రజలను ఉత్తేజితులను చేసాయి. ఎందరో కవులు, కళాకారులు పాటను బుజానికి ఎత్తుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి పాట పల్లవి అయ్యింది. ప్రజాగాయకుడు గద్దర్ మొదలుకుని గోరాటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల ఆశోక్‌ తేజ, రసమయి బాలకిషన్ వంటి కవులు తమ పాటలతో ఉద్యమాన్ని ఉరకలు పెట్టించారు.

రాజకీయ పార్టీలలో సంగీత, సాహిత్యాలతో సంబంధం ఉన్న ఏకైక నాయకుడుగా పేరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు ఆ పాటలనే ఆయుధంగాను, మంత్రంగాను చేసుకుంటున్నాట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలలో విస్రుత ప్రచారం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు కవులు, కళాకారులతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. గడచిన 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన విజయాలు, అమలు చేసిన పథాకాలపై ప్రచారం చేసేందుకు పాటలు రాయిస్తున్నట్లు సమాచారం. 

కవులు, కళాకారులతో సమావేశాలు నిర్వహించడం ఏ సాహిత్యం కావాలో, ప్రజలను తమ వైపుకు తిప్పుకుందుకు ఎలాంటి పాటలు రాయలో ఈ సమావేశంలో కేసీఆర్ వివరించినట్లు సమాచారం. ఈ పనిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తాజ మాజీ ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్ తో ఓ కమిటీ వేసినట్లు చెబుతున్నారు. పాటలు రచన, వాటికి సంగీతం సమకూర్చడం, గాయిని, గాయకుల ఎంపిక వంటి అంశాలను రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

సినీ సంగీత దర్శకులు గాయకులతో చర్చించే పనిని తన కుమారుడు, మంత్రి తారక రామారావుకు అప్పగించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న సాంస్క్రుతిక  గ్రూపులు తమ ఆట...మాట...పాట ప్రదర్శనలతో ప్రజలకు చేరువవుతున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారంలో ఈ గ్రూపులు మరింత ఎక్కువగా ప్రచారం చేసే పనిని ప్రారంభించినట్లు సమాచారం.

కేసీఆర్ బహిరంగ సభలనే కాక, తెలంగాణలోని ప్రతీ గ్రామంలోను పర్యటించి ప్రభుత్వ విజయాలను, పథకాలను పాటల రూపంలో ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. పాటే తమ ఆయుధం....  పాటే తమ విజయ మంత్రమూ అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీనిని బట్టి తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలు మూడు మాటలు...ఆరు పాటలుగా వెలిగిపోనున్నది.

 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE