అరవింద సమేత వీర రాఘవ రివ్యూ

Updated By VankayaThu, 10/11/2018 - 09:26
Aravinda sametha veera raghava review

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో పాతిక సినిమాలు పూర్తి చేసినప్పటికీ అతనితో పాటు అభిమానులు కూడా ఎంతో కాలంగా  ఎదురు చూసిన కాంబినేషన్ త్రివిక్రమ్ శ్రీనివాస్. దాన్ని నిజం చేస్తూ ఇన్నాళ్లకు అరవింద సమేత వీర రాఘవ రూపంలో ప్రేక్షకుల  ముందుకు వచ్చింది. ఈ కాంబోలో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ముందే ఊహించాడు కాబోలు త్రివిక్రమ్ సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించినట్టు ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ చూసినప్పుడే ఖరారైంది. కాకపోతే మాటల మాంత్రికుడి ఇంద్రజాలం రొటీన్ గా ఉండదనే నమ్మకమే ఇంత భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేసింది. మరి ఆకాశాన్ని తాకిన హైప్ ని అందుకునేలా అరవింద సమేత వీర రాఘవ ఉందో లేదో రివ్యూలో చూద్దాం 

కథ 

కామద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)ఫ్యాక్షన్ ప్రత్యర్థులు.లండన్ లో చదువుకుని వచ్చిన వీరరాఘవరెడ్డి(జూనియర్ ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు జరిగిన దాడిలో నారపరెడ్డి చనిపోతాడు. దీంతో ఇక గొడవలు వద్దని చెప్పిన నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)సలహా మేరకు రాఘవ హైదరాబాద్ వెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉంటూ నీలంబరి(సునీల్)గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు.

ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ బ్రతికే ఉన్న బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర)ద్వారా శత్రువు కోసం వేటాడుతూనే ఉంటాడు. ఈ క్రమంలో వీర రాఘవ జాడ తెలుస్తుంది.కానీ గ్రామంలో శాంతి కావాలని  కోరుకున్న వీర రాఘవ అందుకోసం తమకు చెరోపక్క సాయంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకుల(రావు రమేష్, శుభలేఖ సుధాకర్)సహాయం తీసుకుంటాడు. మరి మూర్ఖుడైన బసిరెడ్డి వీర రాఘవ రెడ్డి చేసిన ప్రయత్నాలకు తలొగ్గాడా లేదా అనేదే కథ

నటీనటులు 

జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు. గుండెల్లో బడబాగ్ని దాచుకున్న ఫ్యాక్షన్ లీడర్ గా పరకాయ ప్రవేశం చేసాడు. నిజానికి ఇలాంటి కత్తులు పట్టుకుని శత్రువుల వెంట పడే పాత్రలు తారక్ కు కొత్త కాదు. కెరీర్ ప్రారంభంలోనే తన వయసుకు మించిన బరువైనవి సింహాద్రి, ఆది, సాంబ లాంటివి చాలా చేసాడు. ఆ రకంగా చూస్తే వీర రాఘవ రెడ్డి కొత్తోడేమి కాదు. కొత్త సీసాలో పాత సారాలాగా బాడీ లాంగ్వేజ్ లో మార్పు చూపించాడు తప్ప ఇది వాటికి ఎక్స్ టెన్షన్ లాగే అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ రాకుండా ఉండేందుకు సీమ ఎపిసోడ్స్ లో తారక్ ని త్రివిక్రమ్ అవసరానికి మించిన సీరియస్ గా చూపడం కాస్త ఇబ్బంది పెడుతుంది.

పూజా హెగ్డే తో లవ్ ట్రాక్ నడుస్తున్నంత సేపు హుషారుగా ఉన్న తారక్ ఆ తర్వాత మరీ మూడీగా కనిపించడం అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా కొంత నచ్చకపోయే అవకాశం ఉంది. మొత్తానికి తనకు మాత్రమే సూట్ అయ్యే ఇలాంటి పాత్రలో జూనియర్ చెలరేగిపోయాడు. కాకపోతే ఒళ్ళు జలదరించే యాక్షన్ ఎక్కువగా లేకపోవడం మాస్ కు లోటే. డాన్స్ విషయంలో రెడ్డి ఇటు చూడులో తప్ప మిగిలిన దాంట్లో స్కోప్ దక్కలేదు. అనగనగా ఓ మోస్తరుగా ఉందే అంత స్పెషల్ గా ఏమి అనిపించదు. కానీ సెకండ్ హాఫ్ లో తారక్ లో బెస్ట్ చూడొచ్చు. బాల్ రెడ్డితో రాజీ ఎపిసోడ్ తో పాటు క్లైమాక్స్ ముందు చప్పట్లు కొట్టించుకుంటాడు. కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇందులో ఇచ్చాడు. 

పూజా హెగ్డే గ్లామర్ తో పాటుగా ఫస్ట్ హాఫ్ హాఫ్ లో బాగానే  ఉపయోగపడింది. కథలో కీలక మలుపుకు కారణమే అయినప్పటికీ టైటిల్ లో సగం ప్రాధాన్యత ఇచ్చిన  త్రివిక్రమ్ పాత్ర పరంగా అరవిందను అంత గొప్పగా ఏమి తీర్చలేకపోయాడు. పైగా స్వంత డబ్బింగ్ పేరుతో ప్రయోగం చేసిన పూజా హెగ్డే అందులో మాత్రం సక్సెస్ కాలేదు. చాలా చోట్ల అతకక ఇబ్బందిగా అనిపిస్తుంది. మరీ బక్కపలచని దేహంతో ఒంట్లో కండ తగ్గిపోయి కంటికి అనకపోవడాన్ని గుర్తిస్తే మంచిది.

జగపతిబాబు మూర్ఖుడైన విలన్ బసిరెడ్డి పాత్రలో మంచి ఆప్షన్ గా నిలిచాడు. బాగా మొరటుగా అనిపించే గెటప్ తో కళ్ళతోనే క్రూరత్వం పలికిస్తూ జీవం పోసాడు. నాగబాబు పాత్ర పరిమితం. ఎన్నో సార్లు ఆయన చేసిందే మనం చూసిందే. రావు రమేష్ రొటీనే. సునీల్ తన ఒరిజినల్ వింగ్ లోకి వచ్చి చేసిన  సపోర్టింగ్ రోల్ నీలాంబరిగా ఒదిగిపోయాడు. శ్రీనివాస రెడ్డి, సీనియర్ నరేష్ లు ఉన్నవి కొన్ని సీన్లే అయినా డీసెంట్ కామెడీకి ఉపయోగపడ్డారు. 

పూజా చెల్లిగా ఈషా రెబ్బాది పరిమితమైన పాత్ర. అన్నయ్యగా నటించిన నవీన్ చంద్ర మరీ విలన్ పక్కన ఉండే క్యారెక్టర్ రోల్స్ కి  దిగిపోవడం మొన్న దేవదాస్ తో మొదలై  దీంతో పీక్స్ లోకి వెళ్లిపోయింది. కానీ కొన్ని సీన్స్ లో తన ఉనికిని నిలబెట్టుకున్నాడు.  సితార, ఈశ్వరి రావు, బ్రహ్మాజీ, రవిప్రకాష్, శత్రు, రంగ రాయ్, సంతోష్ కుమార్, శుభలేఖ సుధాకర్, దేవయాని అందరివీ సందర్భానికి తగ్గట్టు వచ్చే చిన్న చిన్న పాత్రలే. రాఘవ బామ్మగా నటించిన సుప్రియ పాఠక్ ఎక్కువ పరిచయం లేని నటి కావడంతో పాత్రకు తగ్గ వెయిట్ తో మంచి ఛాయస్ గా నిలిచింది. 

సాంకేతిక వర్గం 

త్రివిక్రమ్ మేధస్సు దర్శకత్వ ప్రతిభను నిర్వచించే సాహసం ఇంతవరకు ఎవరూ చేయలేకపోయారు. ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకున్నా తన కలం బలంతో ప్రేక్షకులను కేవలం మాటలతోనే మరో లోకంలోకి తీసుకెళ్లే ఆయన మాయాజాలం మాములుది కాదు. ప్లాప్ అని తిట్టిపోసిన ఖలేజా లాంటి సినిమాలు కూడా క్లాసిక్ గానే గుర్తింపు పొందాయి. కానీ అజ్ఞాతవాసి ఈ లెక్కలన్నీ మార్చేసింది. త్రివిక్రమ్ కూడా మాములుగా నాసిరకం స్థాయిలో ఆలోచించగలడు అని ఋజువు చేసింది. అందుకే అరవింద సమేత విషయంలో చాలా ఈక్వేషన్లు వేసుకుని దానికి తగట్టు సరైన కొలతల్లోనే స్క్రిప్ట్ రాసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది.

హీరో పాత్రను అండర్ కరెంట్ గా డిఫరెంట్ షేడ్ లో చూపించి అతని వెనుక పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ లో ఇంకో ట్రాక్ పెట్టడం అనేది ఎప్పుడో అరిగిపోయిన ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకుని త్రివిక్రమ్ తనదైన బాణీలో మొదట్లోనే దాన్ని బ్రేక్ చేసి  కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు కానీ అందులో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. యుద్ధం ఆపేవాడే మగాడు అనే థీమ్ చూపించాలంటే యుద్ధాన్నీ చూపించే తీరాలి కాబట్టి అక్కడ మాత్రం బోయపాటి దారిలో వెళ్ళిపోయాడు. ఇక్కడ అతని మార్క్ మిస్ అయ్యిందే అని ఫీల్ కావడం ప్రేక్షకుల తప్పు కాదు.

ఒక బ్రాండ్ కు అలవాటు పడ్డాక అంచనాలు మార్చడం అంత సులభం కాదు. సీమలో తగ్గిపోయిన ఫ్యాక్షన్ భూతాన్ని మరీ ఇంతగా గ్లోరిఫై చూపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల మధ్య ట్రాక్ ను మొక్కుబడిగా రాసుకున్న త్రివిక్రమ్ అది ఎంటర్ టైనింగ్ గా రాసుకుని ఉంటే ఇది ఇంకో లెవెల్  లో ఉండేది. లవ్ స్టోరీ మొక్కుబడిగా అనిపిస్తుంది.  కానీ సీమలో శాంతిని నెలకొలపాలి అంటే ముందు శత్రువుకు దగ్గరవ్వాలి అనే థీమ్ మీద సెకండ్ హాఫ్ మొత్తం నడిపించిన తీరు సినిమా పూర్తిగా పాడవకుండా కాపాడింది. లేదంటే ఇది మరో దమ్ము ఖాతాలోనే చేరేది.

డైలాగ్స్ లో తన మార్క్ సినిమా మొత్తం లేకపోయినా కీలకమైన సన్నివేశాల్లో మాత్రం త్రివిక్రమ్ రుచి చూపించాడు. చివర్లో మగాళ్ళం మాకేం వచ్చి మీసాలు తిప్పడం తొడలు కొట్టడం తప్ప అని తారక్ తో చెప్పించడం సాహసమే. ఆయన పెన్ పవర్ అంతా ప్రీ ఇంటర్వెల్ నుంచి మొదలై క్లైమాక్స్ దాకా గ్రాఫ్ తగ్గకుండా మైంటైన్ చేస్తూ వచ్చింది. అంతకు ముందు వ్యవహారం అంతా సోసోనే. కాకపోతే పాటల విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. 

తమన్ ట్యూన్స్ ఇప్పటికే పేరు తెచ్చుకున్నాయి. తన పాత ట్యూన్స్ కొంత గుర్తుకు వచ్చినప్పటికీ మరీ నిరాశ పరిచే ఆల్బమ్ కాకపోవడం అరవింద సమేతకు ప్లస్ గా మారింది. కానీ వాటి కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు తమన్. సిగ్నేచర్ ట్యూన్ అంటూ ఏది ప్రత్యేకంగా లేకపోయినా ఇంటెన్సిటీ ని బాగా మైంటైన్ చేసాడు. పిఎస్ వినోద్ ఛాయాగ్రహణం అత్యున్నతంగా ఉంది.

కథ సీమకు మారక అక్కడి సహజమైన వాతావరణాన్ని కృత్రిమంగా వేసిన సెట్ లో తీసినా కళ్ళకు కట్టినట్టు డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కష్టాన్ని తన కెమెరాలో అద్భుతంగా చూపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఓ పావు గంట కోత వేసుంటే ఇంకా క్రిస్పీగా వచ్చేది. హారికా అండ్ హాసిని నిర్మాణం  రిచ్ గా ఉంది. మరీ వందల కోట్ల బడ్జెట్ డిమాండ్ చేసిన సబ్జెక్టు కాదు కాబట్టి ఇండోర్ లోనే మంచి క్వాలిటీ వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంతో స్క్రీన్ నిండుగా కనిపిస్తుంది 

పాజిటివ్ పాయింట్స్ 

జూనియర్ ఎన్టీఆర్ 
జగపతిబాబు విలనీ 
యాక్షన్ ఎపిసోడ్స్ 
ఇంటర్వెల్ బ్యాంగ్ 
సెటిల్మెంట్ సీన్ 
క్లైమాక్స్ 

నెగటివ్ పాయింట్స్ 

లెంగ్త్ 
స్లోగా సాగే ఫస్ట్ హాఫ్ 
రొటీన్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ 
శృతి మించిన వయొలెన్స్ 
ఎంటర్ టైమెంట్ మిస్ 


చివరి మాట

అరవింద సమేత వీర రాఘవ ఒక చిన్న సందేశాన్ని మిక్స్ చేసిన మంచి కమర్షియల్ ఫ్యాక్షన్ సినిమా. తనకు మాత్రమే సొంతమైన శైలిలో త్రివిక్రమ్ సాధ్యమైనంత దీన్ని ఎంగేజింగ్ గా తీసే ప్రయత్నంలో రొటీన్ దారిలోనే వెళ్లినా ఫైనల్ గా ప్రేక్షకుడు సంతృప్తితోనే బయటికి వచ్చేలా చేసాడు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చిన నేపధ్యంలో ఆ పరంగా కొత్తదనం ఆశిస్తే పొరపాటే అవుతుంది.

తారక్ యాక్టింగ్, త్రివిక్రమ్ మాత్రమే డీల్ చేయగలడు అనిపించే ట్రేడ్ మార్క్ యాక్షన్ సీన్స్ మొత్తానికి పైసా వసూల్ అనిపించేలా చేస్తాయి. కాకపోతే సేఫ్ గేమ్ ఆడటం కోసం రెండు వర్గాల మధ్య నరుక్కోవడాన్ని కథగా తీసుకున్న త్రివిక్రమ్ ఇలా కాకుండా తనకు ప్రత్యేకమైన గౌరవం తెచ్చిన స్టైల్ లోనే కొనసాగితే బెటర్. ఇలాంటి కత్తులు కటార్ల సినిమాలు తీసే దర్శకులు బోలెడు ఉన్నారు. అయినా కూడా వీర రాఘవ రెడ్డి నిరాశపరచకుండా మెప్పిస్తాడు. 

అరవింద సమేత వీర రాఘవ - త్రివిక్రమ్ మార్క్ సీమ ఫ్యాక్షన్  

రేటింగ్ : 2.75 / 5 

In English : 

Jr. NTR's Aravindha Sametha Veera Raghava Movie Review


 

ఆర్టికల్ నచ్చితే ..

YOU MAY LIKE